
టోక్యో: ఒలింపిక్స్ 2021 జపాన్‌లో ఆరంభమైంది. ఆ దేశ కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రతిష్ఠాత్మకమైన ఈ స్పోర్ట్స్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. రాజధాని టోక్యో సహా ఎంపిక చేసిన నగరాల్లో ఈ ఈవెంట్స్ కొనసాగుతోన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులను అనుమతించట్లేదు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య క్రీడాకారులు పతకాల వేటలో పడ్డారు. ప్రస్తుతం అర్చరీ ఈవెంట్ కొనసాగుతోంది. మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ అర్చరీలో దీపికా కుమారి పాల్గొంటోన్నారు. తొలి రౌండ్ ముగిసేసరికి ఆమె తొమ్మిదవ స్థానంలో నిలిచారు.
కాగా- ఈ సాయంత్రం ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా- మార్చ్ పాస్ట్ నిర్వహిస్తారు. దీనికి ఏస్ బాక్సర్ మేరీకోమ్, హాకీ ప్లేయర్ మన్‌ప్రీత్ సింగ్ సారథ్యాన్ని వహిస్తారు. భారత జాతీయ పతకాన్ని జట్టును ముందుండి నడిపిస్తారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే అన్ని దేశాలు మార్చ్‌పాస్ట్‌కు హాజరవుతాయి. ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మొత్తం 127 మంది అథ్లెట్లు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నప్పటికీ.. వారందరూ మార్చ్‌పాస్ట్‌లో పాల్గొనట్లేదు. 20 మంది క్రీడాకారులు మాత్రమే దీనికి హాజరు కానున్నారు.
మార్చ్‌పాస్ట్‌లో సుతీర్థ ముఖర్జీ, మణికా బాత్రా, జీ సత్యన్, శరద్ కమల్-టేబుల్ టెన్నిస్, కేసీ గణపతి, వరుణ్ అశోక్, విష్ణు శరవణ్, నేత్ర కుమనన్-సెయిలింగ్, భవానీ దేవి-ఫెన్సింగ్, ప్రణతి నాయక్-జిమ్నాస్టిక్స్, సజన్ ప్రకాష్-స్విమ్మింగ్, సిమ్రన్‌జిత్ కౌర్, లవ్లినా బీ, పూజారాణి, అమిత్, మనీష్ కౌశిక్, సతీష్ కుమార్, మేరీకోమ్-బాక్సింగ్, మన్‌ప్రీత్ సింగ్- హాకీ పాల్గొంటారు. జపాన్ ఆల్ఫాబీటికల్ ప్రకారం..ఈ మార్చ్‌పాస్ట్ క్రమసంఖ్యలో భారత స్థానం.. 21. కరోనా నిబంధనల నేపథ్యంలో ఆరుమంది అధికారులు మాత్రమే మార్చ్‌పాస్ట్‌లో పాల్గొనడానికి అనుమతి ఉంది.
ఈ కార్యక్రమానికి భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు డుమ్మా కొట్టనున్నారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుక (Tokyo Olympics Opening Ceremony)లకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమెతో పాటు పలువురు కీలక షూటర్లు కూడా దీనికి హాజరు కావట్లేదు. పీవీ సింధు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం- శనివారం ఆమె మ్యాచ్ ఆడాల్సి ఉండటమే. సుదీర్ఘ సమయంలో పాటు కొనసాగే మార్చ్‌పాస్ట్‌లో పాల్గొనడం వల్ల అలసట ఏర్పడుతుందని ఆమె భావిస్తోన్నారు. ఆ మరుసటి రోజే మ్యాచ్ ఆడాల్సి ఉన్నందున.. విశ్రాంతి తీసుకోవాలనే కారణంతో ప్రారంభ వేడుకలకు ఆమె దూరం కానున్నారు.