
ఒలింపిక్స్ అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే కొన్ని లీగ్ మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా గురువారం స్పెయిన్ - ఈజిప్టు దేశాల మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రాగా ముగియగా... మెక్సికో ఫ్రాన్స్ మధ్య జరిగి మరో మ్యాచ్‌లో మెక్సికో ఫ్రెంచ్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఫ్రాన్స్ జట్టుపై మెక్సికో 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ జట్టులో ఇద్దరు ప్లేయర్లు గాయాలబారిన పడ్డారు.
ఇక ఒలింపిక్స్ చరిత్ర తిరిగేస్తే.. 1992 ఒలింపిక్స్‌లో స్పెయిన్ ఫుట్‌బాల్ జట్టు స్వర్ణ పతకం సాధించడం ద్వారా ఈ ఘనత సాధించిన చివరియూరోపియన్ దేశంగా రికార్డులో నిలిచింది. గత నెలలో జరిగిన యూరో కప్ 2020లో స్పెయిన్ జట్టు సెమీ ఫైనల్స్ వరకు వచ్చింది. అదే ఆత్మవిశ్వాసంతో టోక్యో ఒలింపిక్స్‌కు ఈ జట్టు జపాన్‌లో అడుగుపెట్టింది. ఇక గురువారం ఈజిప్టుతో జరిగిన మ్యాచ్‌లో అంది వచ్చి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో స్పెయిన్ విఫలమైంది.
ఇక గ్రూప్ ఏలో మెక్సికో ఫ్రాన్స్ పై విజయం సాధించి ఫ్రెంచి జట్టుకు షాక్ ఇచ్చింది. మ్యాచ్ సెకండాఫ్‌లో అలెక్సిస్ వెగా, సెబాస్టియన్ కార్డోవా యూరియల్ ఆంటునా మరియు ఎరిక్ అగిర్‌లు చెరో గోల్ స్కోరు చేయడంతో మెక్సికో ఫ్రాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ఇక గ్రూప్ బిలో న్యూజిలాండ్-దక్షిణ కొరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ వుడ్ గోల్ వేయడంతో 1-0తో ఆ జట్టు విజయం సాధించింది.
ఇక ఆతిథ్య జట్టు జపాన్ దక్షిణాఫ్రికాను డీకొడుతుంది. అయితే కరోనా కారణంగా ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోక్యోకు బయలుదేరే ముందే దక్షిణాఫ్రికా జట్టుకు సంబంధించిన కొందరు కరోనా బారిన పడగా ఆ బృందం టోక్యోకు చేరుకోగానే ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.