
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో దాదాపు ఏడాదిన్నర పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఒలింపిక్స్ గ్రామాన్ని నిర్వాహకులు తెరిచారు. ఎంతో ఘనంగా జరపాల్సిన ఈ వేడుక కరోనా కారణంగా సాదాసీదాగా మారింది. ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, మొదటి మహిళ జిల్ బైడెన్ హాజరు కానున్నారు. అదీ కూడా భర్త జో బైడెన్ లేకుండానే జిల్ బైడెన్ హాజరు కానుండటం విశేషం. జిల్ బైడెన్ కోసం ఒలింపిక్స్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. తొలిసారి ఆయన లేకుండానే జిల్ బైడెన్ విదేశీ ప్రయాణం చేస్తున్నారు. చివరిసారిగా 2010లో కెనడాలో జరిగిన వింటర్ గేమ్స్‌కు తన భర్తతో కలిసి ఆమె వెళ్లారు. గతంలోనూ పలువురు అమెరికా ప్రథమ మహిళలు ఒలింపిక్స్‌ను సందర్శించారు. 1994లో హిల్లారి క్లింటన్ లిల్లెహ్యామర్ వింటర్, 1996 అట్లాంట గేమ్స్‌ను వీక్షించగా.. 2006 టురిన్ ఒలింపిక్స్, 2008 సమ్మర్ ఒలింపిక్స్‌లో లారా బుష్.. 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో మిచెల్ ఒబామా సందడి చేశారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో స్టాండ్స్‌లో అభిమానులను అనుమతించరు. వైరస్ నేపథ్యంలో టోక్యోలో అత్యవసర పరిస్థితి విధించారు. అమెరికా మిత్రపక్షం అయిన జపాన్ గణనీయ స్థాయిలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగింది. జులై 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ క్రీడలకు దాదాపుగా 11వేల మంది, పారాలింపిక్స్‌కు 4400 మంది క్రీడాకారులు రానున్నారు. పారాలింపిక్స్ ఆగస్టు 24 నుంచి మొదలవుతాయి. క్రీడా గ్రామంలోకి వస్తున్న అథ్లెట్లలో 80% మందికి వ్యాక్సినేషన్ జరిగిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది.
టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి మొత్తం 228 మంది బృందం వెళుతుందని, అందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారని భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షుడు నరిందర్ బత్రా తెలిపారు. 119 మంది అథ్లెట్లలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 85 విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఈనెల 17న.. 90 మంది క్రీడాకారులు, ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక విమానంలో టోక్యోకు బయలుదేరనున్నారు. మిగతా బృందం మరోసారి వెళ్లనున్నారు.