
వారణాసి: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో పోటీ చేసే క్రీడాకారులకు ఆయా రాష్ట్రాలు నజరానా ప్రకటిస్తున్నాయి. ముందుగా తమిళనాడు ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం ప్రోత్సహకాలు ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా చేరింది. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచే విజేతలకు ఆరు కోట్ల నగదు ఇస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. టీమ్ ఈవెంట్లలో స్వర్ణం గెలిచే క్రీడాకారులకు మూడేసి కోట్లు ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈనెల 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న భారత క్రీడాకారుల్లో.. పది మంది ఆటగాళ్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే చెందిన వాళ్లు ఉన్నారు. షూటర్ సౌరభ్ చౌదరీ యూపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సింగిల్స్, టీమ్ ఈవెంట్లలో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారిడికి 10 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. అంతకముందు యోగి వారణాసిలో కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడలు వాయిదాపడి.. ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.

టోక్యో ఒలింపిక్స్ 2021లో పోటీ చేసే క్రీడాకారులకు అందరికంటే ముందుగా తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ వెల్లడించారు. సిల్వర్ పతక విజేతకు రెండు కోట్లు, అలానే కాంస్య పతక విజేతకు ఒక కోటి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఒడిశా అథ్లెట్లకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ కూడా ప్రోత్సహకాలు ప్రకటించారు. బంగారు పతకం సాధించిన వారికి రూ.6 కోట్లు, రజతం సాధిస్తే రూ.4 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.2.5 కోట్లు చొప్పున బహుమతిగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
ఒలింపిక్స్‌కు సర్వం సిద్ధమైంది. అత్యయిక స్థితిలోనే మంగళవారం ఒలింపిక్స్ గ్రామాన్ని తెరిచారు. ఎంతో ఘనంగా జరపాల్సిన ఈ వేడుక కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సాదాసీదాగా మారింది. క్రీడా గ్రామంలో ప్రతి రోజూ క్రీడాకారులకు కొవిడ్ పరీక్షలు చేస్తారు. ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు రెండుసార్లు పరీక్షలు ఉంటాయి. టీకా వేయించుకున్నప్పటికీ గ్రామంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించేలా, చేతులు కడుక్కోవడం, కిటికీలు తెరిచేలా పదేపదే సూచనలు చేస్తారు.