
టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో నాలుగో రోజు భారత్.. పరాజయాల బాట పట్టింది. ఆరంభంలో ప్రదర్శించిన దూకుడు.. సన్నగిల్లింది. తరువాతి రౌండ్లలో ఓటమిని చవి చూస్తూ వచ్చారు భారత అథ్లెట్లు. ఫెన్సింగ్, పురుషుల అర్చరీ, టేబుల్ టెన్నిస్.. ఇలా ఈ ఉదయం ఉత్సాహాన్ని ఇచ్చిన మ్యాచ్‌లన్నీ తదుపరి రౌండ్‌లల్లో భారత ప్రస్థానాన్ని అడ్డుకున్నాయి. పరాభవానికి దారి తీశాయి. కొన్ని ఈవెంట్లల్లో ద్వితీయ విఘ్నం వెంటాడింది. భారత అథ్లెట్ల ప్రస్థానంలో ఓ భాగం ముగిసినట్టే. ఇక వారంతా ఒక్కొక్కరుగా స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతోన్నారు.. ఒట్టి చేతులతో!
తాజాగా భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సుమిత్ నగల్ కూడా వెనుదిరిగాడు. రెండో రౌండ్‌లో అతను రష్యన్ ఒలింపిక్ కమిటీకి చెందిన డేనిల్ మెద్వెదెవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 2-6, 1-6 వరుస సెట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. అరియాకె టెన్నిస్ ఎరీనాలో జరిగిన ఈ పోరులో సుమిత్ నగల్ తన ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేసిప్పటికీ.. అది సరిపోలేదు. మెద్వెదెవ్ వరల్డ్ నంబర్ 2 ప్లేయర్. అతని అనుభవం ముందు సుమిత్.. తలవంచక తప్పలేదు. మెద్వెదెవ్ వంటి ఆటగాడిని నిలువరించి తొలి సెట్‌లో రెండు పాయింట్లను సాధించగలిగడం అభినందించదగ్గదే.
అదే సమయంలో బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భమిడిపాటి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ షెట్టి జోడీ కూడా ఓటమి పాలైంది. వారిపై ఇండోనేషియా జోడీ మార్కస్ గిడియాన్-కెవిన్ సుకముల్జో 21-13, 21-12 తేడాతో విజయం సాధించింది. డబుల్స్ ఈవెంట్ గ్రూప్ ఎ స్టేజ్‌లో బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ షెట్టి.. ప్రపంచ నంబర్ వన్ ఇండోనేషియా జోడికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఇండోనేషియా జోడి మొదటి గేమ్‌ను సునాయాసంగా గెలిచారు. రెండో రౌండ్‌లో ఓడినా భారత జట్టుకి ఇంకా నాకౌట్స్‌కి చేరేందుకు అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్‌లో బ్రిటీష్ జోడితో సాత్విక్-చిరాగ్ శెట్టి జోడి గెలిస్తే క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధిస్తారు.