
తుపాను గండం:
జపాన్‌లో నెపార్తక్ తుపాను ఈ నెల 27న తీరం దాటే అవకాశమున్నట్టు ఆ దేశ వాతావరణశాఖ సోమవారం వెల్లడించింది. తూర్పు జపాను వద్ద పసిఫిక్ మహా సముద్రం వైపు ఆ తుపాను మంగళవారం తీరం దాటే అవకాశముందట. దీంతో తీవ్ర స్థాయిలో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. తుఫాను కారణంగా జపాన్ ఈశాన్య ప్రాంతంలో 5.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవనుంది. ఇక బుధవారం నాటికి పరిస్థితి మరింత ఉద్ధృతంగా మారే సూచనలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది.

సర్ఫింగ్ షెడ్యూల్లో మార్పులు:
నెపార్తక్ తుపాను కారణంగా ఒలింపిక్స్ 2021లో అరంగేట్ర క్రీడ సర్ఫింగ్ షెడ్యూల్లో టోక్యో నిర్వాహకులు మార్పులు చేశారు. బుధవారం జరగాల్సిన సర్ఫింగ్ హీట్స్.. ఒకరోజు ముందుగా నిర్వహించనున్నారు. సర్ఫింగ్ క్రీడలు మంగళవారమే జరగనున్నాయి. టోక్యో 2020లో సర్ఫింగ్ క్రీడ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వాతవరణ మార్పుల ప్రభావం ముందుగా ఆర్చరీపై పడింది. మంగళవారం మధ్వాహ్నం జరగాల్సిన మ్యాచ్‌లను బుధవారం, గురువారానికి నిర్వాహకులు వాయిదా వేశారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ వాతవరణ సమస్యల కారణంగా ఆటలు ఆలస్యంగా నిర్వహించారు.

16 కొత్త కేసులు:
ఒక పక్క ఆటలు సాగుతుండగా మరోపక్క కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా డచ్ టెన్నిస్ ఆటగాడు జీన్ జూలియన్ రోజర్‌కు కరోనా సోకింది. దీంతో అతడు క్రీడల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రోజర్ అతడి డబుల్స్ భాగస్వామి వెస్లీ కూలుఫ్ న్యూజిలాండ్ ద్వయం మార్కస్ డానియల్, మైకేల్ వీనస్‌తో తలపడాల్సి ఉంది. పాజిటివ్ ఫలితం రావడంతో అతడు రెండో రౌండ్ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. క్రీడా గ్రామంలో సోమవారం 16 కొత్త కేసులు రావడం గమనార్హం. సోమవారం ముగ్గురు అథ్లెట్లు, నలుగురు కాంట్రాక్టర్లు, ఎనిమిది మంది సహాయ సిబ్బంది, ఒక ఉద్యోగికి పాజిటివ్ వచ్చినట్టు నిర్వాహకులు ప్రకటించారు.


Click it and Unblock the Notifications
