
టోక్యో: అంగరంగ వైభవంగా ఆరంభమైన విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల వైఫల్యాలు కొనసాగుతోన్నాయి. తొలిరోజు అర్చర్లు నిరాశ పరచగా.. రెండో రోజు షూటర్లు ఆ బాధ్యతను తీసుకున్నట్లు కనిపించింది. మహిళలు, పురుషుల అర్చర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అర్చర్ దీపికా కుమారి తొలి రౌండ్‌లో తొమ్మిదో స్థానంతో సరి పెట్టుకున్నారు. పురుషుల విభాగంలో ప్రవీణ్ జాదవ్, అతాను దాస్, తరుణ్ దీప్ రాయ్‌దీ అదే పరిస్థితి. ఈ నెల 27 మలి రౌండ్‌లో దీపికా కుమారి.. భూటాన్‌కు చెందిన అర్చర్ కర్మను ఎదుర్కొనాల్సి ఉంది.
రెండో రోజు షూటర్లు మిస్‌ఫైర్ అయ్యారు. అపూర్వి చందేలా, ఎలావెనిల్‌ల బుల్లెట్ గురి తప్పింది. లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ విభాగంలో అపూర్వి చందేలా, ఎలావెనిల్ విఫలం అయ్యారు. ఈ కేటగిరీలో అపూర్వి చందేలా 36వ స్థానంతో సరిపెట్టుకోగా.. ఎలావెనిల్ కాస్త ఫర్వాలేదనిపించారు. టాప్ 20లో నిలిచారు. 16వ స్థానాన్ని దక్కించుకోగలిగారు. దీనితో వారిద్దరూ చివరి రౌండ్ల వరకూ నిలిచే అవకాశాన్ని కోల్పోయినట్టయింది. 626.5 పాయింట్లతో ఎలావెనిల్ 16వ స్థానంలో నిలిచారు.
తమిళనాడులోని కడలూర్‌కు చెందిన ఎలావెనిల్ చివరి సిరీస్‌లో తడబడ్డారు. ఈ విభాగంలో నార్వేకు చెందిన జెనెట్ హేగ్ ఒలింపిక్స్‌లో సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పారు. 632.0 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లారు. ఈ రౌండ్‌లో ప్రతి షూటర్ కూడా ఆరు సిరీస్‌లల్లో 10 సార్లు లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. అత్యధిక పాయింట్లను సాధించిన చివరి ఎనిమిది మంది షూటర్లను ఫైనల్‌కు అర్హత సాధించినట్లుగా ప్రకటిస్తారు. ఈ టాప్ 8లో భారతీ షూటర్లు చోటు దక్కించుకోలేకపోయారు. అపూర్వి చందేలా 621.9 పాయింట్లు, ఎలావెనిల్ 626.5 పాయింట్లను సాధించారు.
కొరియా షూటర్ పార్క హీమున్, అమెరికా షూటర్ మేరీ టకర్, నోన్ ఎనూజీ-కొరియా, ఒషేన్ ములర్-ఫ్రాన్స్, యంగ్ కియాన్-చైనా, నీనా క్రిస్టన్, అనాస్తాసియా గైలాషినా తొలి ఎనిమిది మందిలో ఉన్నారు. ఇక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఆశలన్నీ పురుషులపైనే ఉన్నాయి. వండర్ కిడ్ సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ ఈ విభాగంలో ఎలాంటి పెర్‌ఫార్మెన్స్ ఇస్తారనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 9:30 గంటలకు పురుషుల విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ప్రారంభమౌతుంది.