
టోక్యో: ఒలింపిక్స్ 2021 షూటింగ్ విభాగంలో భారత్ కచ్చితంగా మెడల్ గెలుస్తుందనుకున్నా.. అలా జరగలేదు. భారత మహిళా, పురుష షూటర్లు పూర్తిగా నిరాశపరిచారు. పతకం ఆశలు రేపిన యువ షూటర్ సౌరభ్ చౌదరీ ఫైనల్ మెట్టుపై బోర్లాపడ్డాడు. షూటింగ్ పురుషుల 10. మీ. ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేయని సౌరభ్.. 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ నంబర్ 2 షూటర్ సౌరభ్ మొత్తం స్కోరు 137.4. సౌరభ్ పోటీదారు చైనాకు చెందిన బోవెన్ జాంగ్ 137.7 స్కోర్ చేశాడు.
అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్‌లో సౌరభ్ చౌదరీ అగ్రస్థానంలో నిలిచాడు. 586 పాయింట్లతో 19 ఏళ్ల యువ షూటర్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. 10 మీటర్ల పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో మొత్తం 36 మంది పోటీపడగా.. 586-28Xతో సౌరభ్ అగ్రస్థానంలో నిలిచాడు. సౌరభ్ ఆరు సిరీసుల్లో వరుసగా 95, 98, 98, 100, 98, 97 పాయింట్లు సాధించడం గమనార్హం. దీంతో భారత్ ఫైనల్‌కు చేరింది. ఇక పతకం ఖాయం అనుకున్నా.. యువ షూటర్ పూర్తిగా విఫలమయి 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరో భారత షూటర్ అభిషేక్ వర్మ అర్హత కూడా సాధించలేకపోయాడు. 575 పాయింట్లతో అభిషేక్ వర్మ 17వ స్థానంలో నిలిచాడు.
అంతకుముందు భారత మహిళా షూటర్లు పూర్తిగా నిరాశపరిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఇండియన్ షూటర్లు ఇద్దరు ఉన్నా.. కనీసం ఫైనల్ కూడా చేరుకోలేకపోయారు. ఎన్నో ఆశలు రేపిన ఎలవనిల్ వలరివన్, సీనియర్ అపూర్వి చండీలా ఇద్దరూ ఫైనల్‌కు క్వాలిఫై కాలేకపోయారు. ఎలవనిల్ 626.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలవగా.. అపూర్వి చండీలా 621.9 పాయింట్లతో 36వ స్థానంతో సరిపెట్టుకుంది.
ఇక టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మనికా బత్రా విజయం సాధించింది. గ్రేట్ బ్రిటన్ క్రీడాకారిణిపై నాలుగు వరుస గేమ్‌ల్లో గెలిచింది. 11-7, 11-6, 12-10, 11-9 తేడాతో మనికా చిత్తు చేసింది. అంతకుముందు టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో శరత్ కమల్‌తో కలిసి ఆడిన మనికా.. చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైంది.