Tokyo Olympics 2021: ఆ మాత్రం ఎండదెబ్బకే కళ్లు తిరిగితే ఎట్టా: సొమ్మసిల్లిన రష్యన్

టోక్యో: జపాన్‌లో ఎండ వేడిమి ఒలింపిక్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అతి శీతల దేశాలకు చెందిన అథ్లెట్లు ఎండ తీవ్రతను తట్టుకోలేక పోతోన్నారు. భారత్‌లో సర్వసాధారణంగా నమోదయ్యే 33 డిగ్రీల ఉష్ణోగ్రత.. శీతల దేశాల నుంచి వచ్చిన అథ్లెట్లకు ఇబ్బందికరంగా పరిణమించింది. తొలి రోజే అపశృతి కనిపించింది. రష్యాకు చెందిన మహిళా అర్చర్ ఈ మాత్రం ఎండదెబ్బకు తట్టుకోలేకపోయారు. సొమ్మసిల్లిపడిపోయారు. జపాన్ కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 9 గంటలకు ఈవెంట్ ప్రారంభమైనప్పటి నుంచీ ఏకధాటిగా కొనసాగటం కూడా దీనికి కారణమైంది.

సొమ్మసిల్లిన రష్యన్
ఆ రష్యన్ మహిళా అర్చర్ పేరు స్వెత్లానా గోంబోయెవా. ఈ ఉదయం అర్చరీ మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ కేటగిరీలో ఆమె పోటీ చేశారు. ఫైనల్ స్కోర్ చెక్ చేస్తోన్న సమయంలో ఆమె ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. ఒలింపిక్స్ సిబ్బంది, సపోర్టింగ్ టీమ్ వెంటనే ఆమెకు సపర్యలు చేశారు. ఐస్ బ్యాగ్స్‌ను తలకు అద్దడంతో తేరుకున్నారు. తానకేమీ కాలేదని, క్షేమంగా ఉన్నానని చెప్పారు. విశ్రాంతి తీసుకోవడానికి నిరాకరించారు. పోటీల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎండ తీవ్రత వల్లే స్వెత్లానా ఇబ్బందులకు గురయ్యారని ఆమె కోచ్ స్టానిస్లవ్ పొపొవ్ చెప్పారు.

జపాన్ తరహా ట్రైనింగ్..
టోక్యోలో శుక్రవారం కాలం గడుస్తున్న కొద్దీ ఎండ తీవ్రత పెరుగుతూ పోయింది. ఉదయం పూట 28 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రత.. క్రమంగా పెరిగింది. 33 డిగ్రీలకు చేరుకుంది. ఇది కాస్త కొన్ని దేశాలకు చెందిన అథ్లెట్లకు ఇబ్బందులకు గురి చేయడం ఆరంభించింది. జపాన్‌లో ఈ తరహా పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతో ఆ దేశ ప్రభుత్వం.. తమ అథ్లెట్లకు అదే తరహా వాతావరణంలో శిక్షణ ఇప్పించింది. దీనికోసం వ్లడివొస్టోక్‌లో కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇప్పించింది. అయినప్పటికీ.. స్వెత్లానా సొమ్మసిల్లడానికి గాలిలో తేమశాతం ప్రధాన కారణమైందని పొపొవ్ చెప్పారు.

ఈ వాతావరణం కొత్తే..
ఈ తరహా వాతావరణానికి కొత్త కావడం వల్ల తొలిరోజు స్వెత్లానా ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఆమె టీమ్‌మేట్ సెనియా పెరొవా చెప్పారు. ప్రస్తుతం ఆమె కొలుకున్నారని, గేమ్‌ను కొనసాగిస్తోన్నారని పేర్కొన్నారు. ఐస్‌బ్యాగ్స్, గొడుగులు సిద్ధంగా ఉంచుకుంటోన్నామని వివరించారు. తరచూ మంచినీళ్లను తాగడానికి ప్రాధాన్యత ఇస్తోన్నామని చెప్పారు. ఒక్కసారి అలవాటు పడితే ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ఆశిస్తున్నట్లు చెప్పారు.

భారత్ నిరాశ..
ఇదే విభాగంలో తొలి రోజు భారత్ నిరాశ పరిచింది. అర్చరీలో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయింది. అర్చరీ మహిళ విభాగం తొలి రౌండ్‌లో వరల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ నెల 27, 28వ తేదీల్లో మలి విడత రౌండ్లలో ఆమె పాల్గొనాల్సి ఉంది. పురుషుల్ విభాగంలో అతాను దాస్ కూడా ఆశించిన స్థాయిలో పెర్‌ఫార్మ్ చేయలేకపోయాడు. తొలి సగం ముగిసేసరికి 34వ స్థానంలో నిలిచాడు. ప్రవీణ్ జాదవ్ 656 పాయింట్లతో 31వ స్థానంలో నిలిచాడు. మరో అర్చర్ తరుణ్ దీప్ మరింత తక్కువ ర్యాంకింగ్‌ను నమోదు చేశాడు. 652 పాయింట్లతో 37వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications