
టోక్యో: క్రీడా ప్రపంచంలో అత్యున్నతంగా భావించే ఒలింపిక్స్‌లో పాకిస్తాన్ తన వివాదాస్పద వైఖరిని బయట పెట్టుకుంది. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండటానికి అత్యంత కఠినంగా అమలు చేస్తోన్న నిబంధనల ఉల్లంఘనకు పాల్పడింది. పాకిస్తాన్ క్రీడాకారులు కొందరు కోవిడ్ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించినట్లు ఒలింపిక్స్ కమిటీ నిర్ధారించింది. పాకిస్తాన్‌తో పాటు కిర్గిస్తాన్, తజకిస్తాన్‌కు చెందిన పలువురు అథ్లెట్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు పేర్కొంది. అనుకోకుండా చోటు చేసుకున్న ఘటనే అని పాకిస్తాన్ ఒలింపిక్స్ టీమ్ మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్ ప్రారంభ వేడుక సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒలింపిక్స్‌లో పాల్గొంటోన్న ప్రతి దేశం కూడా ఓపెనింగ్ సెరిమని సందర్భంగా మార్చ్‌పాస్ట్‌ను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. జపాన్ కాలమానం ప్రకారం.. శుక్రవారం రాత్రి టోక్యో నేషనల్ స్టేడియంలో గ్రాండ్‌గా నిర్వహించిన ఈ ఈవెంట్‌లో ఆయా దేశాలకు చెందిన అథ్లెట్లు మార్చ్‌పాస్ట్‌కు పాల్గొన్నారు. తమ దేశ జాతీయ పతాకాలను ధరించి.. జట్టును ముందుకు నడిపించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ అథ్లెట్లు కొందరు ముఖానికి మాస్క్ ధరించి కనిపించలేదు.
ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించిన ఆ దేశ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మహూర్ షెహజాద్ మాస్క్ ధరించినప్పటికీ.. అది ముఖాన్ని కవర్ చేయలేదు. గడ్డం కిందికి దాన్ని ధరించారు. అలాగే షూటర్ ఖలీల్ అఖ్తర్ ముక్కును కవర్ చేసేలా మాస్క్ పెట్టుకోలేదు. నోటి వరకే అతను మాస్క్‌ను ధరించి కనిపించాడు. కొందరు అథ్లెట్లు మాస్కులను గడ్డం కిందికి జరిపి, మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. కిర్గిస్తాన్, తజకిస్తాన్‌కు చెందిన కొందరు అథ్లెట్లు కూడా అదే తరహాలో ప్రవర్తించారు. కొందరు మాస్కులను సైతం ధరించలేదు. టోక్యో ఒలింపిక్స్ 2021 ప్లేబుక్‌లో పొందుపరిచిన మార్గదర్శకాలు, జపాన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న కోవిడ్ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించినట్టే.
ఈ ప్లేబుక్ ప్రకారం..ప్రతి అథ్లెట్, ప్రజెంటర్లు, వలంటీర్లు, అధికారులు, సపోర్టింగ్ స్టాఫ్.. ఇలా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లను ధరించాల్సి ఉంటుంది. ఈవెంట్లలో పాల్గొనే సమయంలో మాత్రమే ఆ అవసరం లేదని ప్లేబుక్ స్పష్టం చేసింది. కోవిడ్ ప్రొటో్కాల్స్ ఉల్లంఘించిన పాకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్ అథ్లెట్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియరావాల్సి ఉంది. వ్యక్తిగత జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్చ్‌పాస్ట్‌లో భారత టీమ్‌కు స్టార్ ఒలింపియన్ మేరీకోమ్, హాకీ ప్లేయర్ మన్‌ప్రీత్ సింగ్ ప్రాతినిథ్యాన్ని వహించారు.