
జపాన్: కరోనా మహమ్మారి ప్రభావంతో దాదాపు ఏడాదిన్నర పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ ఈ నెల 23న ప్రారంభం కానున్నాయి. మరో వారం రోజుల్లో ప్రారంభంకానున్న విశ్వ క్రీడలను కరోనా మహమ్మారి వీడట్లేదు. గురువారం మరోసారి కరోనా కలకలం రేగింది. ఇప్పటికే పలు కేసులు నమోదవ్వగా.. ఇప్పుడు క్వారంటైన్లో ఉన్న మరో అథ్లెట్‌కు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రష్యా రగ్బీ జట్టులోని ఐదుగురు సిబ్బందికి కూడా వైరస్ సోకింది. బ్రెజిలియన్ జూడో బృందానికి ఆతిథ్యమిస్తున్న జపనీస్ హోటల్‌లోని ఎనిమిది మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారట. ఈ విషయాన్ని ఒలింపిక్ నిర్వహణ కమిటీ తెలిపింది.
పాజిటివ్ అని నిర్ధారణ అయిన అథ్లెట్ ఒలింపిక్స్ గ్రామంకు ఇంకా చేరుకోలేదని గురువారం ఒలింపిక్ నిర్వహణ కమిటీ స్పష్టం చేసింది. అంతకుముందు బ్రెజిల్ ఒలింపిక్ జట్టు బస చేసిన హోటల్‌లో ఏడుగురు సిబ్బంది, కెన్యా మహిళా రగ్బీ జట్టులో ఎనిమిది మంది సభ్యులకు పాజిటివ్‌గా తేలింది. కెన్యా మహిళా రగ్బీ జట్టులోని ఎనిమిది మంది సభ్యులు జపాన్‌లోని కురుమెలో శిక్షణా శిబిరం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం టోక్యోకు వెళ్లే సమయంలో ప్రయాణీకులతో వారు సన్నిహితంగా మెలిగారట. అక్కడే వైరస్ సోకిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
టోక్యోలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం (జులై 15) కేసులు సంఖ్య ఆరు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయో లేదో అని అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే కరోనా జాగ్రత్తల నడుమ విశ్వక్రీడలు సురక్షితంగా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ధీమా వ్యక్తం చేశారు. ఎట్టిపరిస్థితిలో మెగా క్రీడలు జరుగుతాయని స్పష్టం చేశారు.
నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ క్రీడల కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కరోనా మహమ్మారితో పాటు హైప్రొఫైల్ అథ్లెట్లు ఈసారి టోర్నీకి దూరంగా ఉండటంతో.. టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌పై ఎవరూ ఆసక్తి చూపడం లేదని తాజా సర్వే తేల్చింది. ఇప్సోస్ అనే సంస్థ 28 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. కేవలం 46 శాతం మందికి మాత్రమే గేమ్స్‌పై ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొంది. క్రీడలు జరిగే జపాన్‌లో అయితే కేవలం 35 శాతం మంది మాత్రమే ఒలింపిక్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారట.