
టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ఒలింపిక్స్ 2021లో భారత్ అంచనాలకు మించి రాణిస్తోంది. పతకంపై పెద్దగా ఆశలేవీ లేని కేటగిరీలోనూ దూకుడును ప్రదర్శిస్తోంది. ఆట మొదలైన రెండోరోజే మహిళల 49 కేజీలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకాన్ని ముద్దాడిన భారత్.. ఇంకో మెడల్ సాధించడానికి అతి చేరువగా వెళ్లింది. ఇంకొక్క విజయాన్ని సాధించగలిగితే.. పతకం గ్యారంటీ అవుతుంది. ఇందులో పతకాన్ని సాధించ గలిగితే.. అది రికార్డే అవుతుంది. ఇప్పటిదాకా మన చేతికి అందని కేటగిరీలో తొలిసారిగా మెడల్ కొట్టినట్టవుతుంది.
పురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్ రీపెఛెజ్ విభాగంలో భారత రోయర్లు సెమీ ఫైనల్‌లోకి అడుగు పెట్టారు. నిజానికి- ఎవరూ ఊహించని కేటగిరీ ఇది. దీనికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రోయర్లు అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ జోడీ ఈ ఘనతను సాధించింది.. జపాన్ సీ ఫారెస్ట్ వాటర్ వేలో నిర్వహించిన ఈ పోటీల్లో ఎవరూ ఊహించని విధంగా విజయ పతాకాన్ని ఎగురవేసింది ఈ జోడీ. పోలెండ్‌కు చెందిన జెర్జీ కోవాల్స్కీ, అర్థర్ మికోలాజ్చెవ్స్కీ జోడీ తొలి స్థానంలో నిలిచింది. స్పెయిన్ రెండో స్థానాన్ని ఆక్రమించింది.
భారత్ మూడోస్థానానికి చేరుకుంది. ఇందులో సెమీ ఫైనల్‌లో విజయం సాధించితే కాంస్య పతకం ఖాయమౌతుంది. ఫైనల్‌కు చేరగలిగితే రజతం.. అందులో విజయం సాధించగలిగితే గోల్డ్ మెడల్ భారత మెడలో పడినట్టే. తమ ల్యాపింగ్‌ను పోలెండ్ జంట 6:43:44 నిమిషాల్లో పూర్తి చేసి.. టేబుల్ టాప్‌గా నిలిచింది. 6:45:71 నిమిషాల్లో లక్ష్యాన్ని అధిగమించిన స్పెయిన్ రెండో స్థానంలో నిలవగా.. 6:51:36 నిమిషాల్లో ల్యాపింగ్‌ను పూర్తి చేసిన భారత రోయర్లు అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ జోడీ మూడో స్థానానికి చేరుకుంది. ఆ తరువాతి స్థానంలో ఉజ్బెకిస్తాన్ నిలిచింది. 6:56:22 నిమిషాలకు గమ్యాన్ని చేరిందా దేశ జోడి
