
టోక్యో: జపాన్‌లో కొనసాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ మిశ్రమ ఫలితాలను చవి చూస్తోంది. ఆధిపత్యాన్ని చలాయిస్తుందనుకున్న ఈవెంట్‌లో కొంత వెనుకంజ వేస్తోంది. ఎదురు దెబ్బలను ఎదుర్కొంటోంది. మిక్స్డ్ అర్చరీ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లో అడుగు పెట్టడం, హాకీలో ఘన విజయాన్ని అందుకోవడం, పురుషుల బ్యాడ్మింటన్‌లో దూకుడును ప్రదర్శిస్తూ గెలుపు బాటలో పయనిస్తోండటం వంటి సానుకూల ఫలితాల మధ్య కొంత చేదు అనుభవాలను మూటగట్టుకుంటోంది. గట్టి పట్టు ఉన్న మహిళల జుడో కేటగిరీలో అనూహ్య ఫలితాలను అందుకుంది.
భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న జుడోకా సుశీల దేవి లిక్మాబమ్.. తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. ఎలిమినేషన్ రౌండ్‌లో ప్రత్యర్థిని ప్రతిఘటించినప్పటికీ.. దాన్ని విజయంగా మలచుకోలేకపోయారామె. మహిళల 48 కేజీల జుడో విభాగంలో హంగేరీకి చెందిన ఇవా సెర్నోవిజ్కీ చేతిలో ఓడిపోయారు. ఇవా సెర్నోవిజ్కీ.. మెడల్ హాట్ ఫేవరెట్. 2012 లండన్ ఎడిషన్ ఒలింపిక్స్‌లో ఆమె కాంస్య పతకాన్ని అందుకున్నారు. ఈ సారి కూడా పతకం వేటలో ఉన్నారు.
మణిపూర్‌కు చెందిన 26 సంవత్సరాల జుడోకా సుశీల దేవి పోరాటం అంత తేలిగ్గా ముగియలేదు. ప్రతి రౌండ్‌లోనూ ఆమె గట్టి పోటీ ఇచ్చారు. సెషన్‌ను 32వ రౌండ్ వరకూ తీసుకెళ్లారు. ఆ తరువాత ఇక జోరు తగ్గింది. ప్రత్యర్థి అలసి పోవడం, పొరపాట్లు చేయడాన్ని పసిగట్టిన ఇవా.. దూకుడు పెంచారు. చివరికి పైచేయి సాధించారు. 32వ రౌండ్‌లో సుశీల దేవి చేసిన చిన్న పొరపాటును ఆమె ఓటమికి కారణమైంది. మహిళల జుడోకా విభాగానికి సుశీల దేవి ఒక్కరే ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఆమె ఓటమితో ఈ కేటగిరీలో తలుపులు మూసుకుపోయాయి.
క్వాలిఫయింగ్ రౌండ్‌లో అద్భుతంగా రాణించారు సుశీల దేవి. 16 రౌండ్లలో మ్యాచ్ సెషన్‌ను ముగించగలిగారు. జపాన్‌కు చెందిన ఫునా టోనాకీని స్వల్ప సమయంలోనే ఓడించారు. దీనితో ఈ కేటగిరీలో ఆమె గట్టిపోటీ ఇస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒలింపిక్స్‌కు కొత్త కావడం, తొలి రౌండ్‌లోనే స్టార్ ఒలింపియన్ ఎదురు కావడం ఒకరకంగా సుశీల దేవి పరాజయానికి కారణమైంది. తన రాష్ట్రానికే చెందిన ఐకనిక్ బాక్సర్ మేరీ కోమ్‌ను ఆదర్శంగా తీసుకుని సుశీల దేవి జుడోలో శిక్షణ పొందారు. కాంటినెంటల్ కోటాలో ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు.