
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021 ఈ నెల 23 నుంచి జపాన్ రాజధాని టోక్యోలో ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో పాల్గొనే భారత షూటింగ్ జట్టు టోక్యో చేరుకుంది. శనివారం ఉదయం 15 మందితో కూడిన భారత జట్టు శనివారం ఉదయం టోక్యోలో దిగింది. క్రొయేషియాలోని జాగ్రెబ్ బేస్ నుంచి నిన్న భారత షూటింగ్ జట్టు ఆమ్‌స్టెర్‌డామ్ చేరుకుంది. ఈ సందర్భంగా ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర పాటు వాయిదా పడిన ఒలింపిక్స్ 2020 మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్నాయి.
షూటింగ్ జట్టులో మనూ బాకర్, సౌరభ్ చౌదురి వంటి యువ క్రీడాకారులతో పాటు సంజీవ్ రాజ్‌పుత్ వంటి సీనియర్లు కూడా ఉన్నారు. యువత, సీనియర్లతో కూడిన షూటింగ్ జట్టు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధించిపెడుతుందని భారీ ఆశలు ఉన్నాయి. భారత జట్టు ఈ నెల 24న పతకాల వేట ప్రారంభించనుంది. న్యూఢిల్లీ, క్రొయేషియాలలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో ఈ జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. అయితే క్రియేషియాలో జరిగిన పోటీల్లో భారత్ తక్కువ పతకాలు గెలుచుకుంది. 52 మంది షూటర్లు పాల్గొనగా.. 14 పతకాలు మాత్రమే వచ్చాయి.
భారత సెయిలింగ్ జట్టు మంగళవారమే టోక్యో చేరుకున్న విషయం తెలిసిందే. భారత్ నుంచి ఒలింపిక్స్ కోసం టోక్యోలో అడుగుపెట్టిన తొలి బృందం ఇదే. వరుణ్ ఠక్కర్, గణపతి చెంగప్ప, విష్ణు శరవణన్, నేత్ర కుమనన్.. కోచ్‌లు, ఇతర సహాయ సిబ్బందితో కూడిన సెయిలింగ్ జట్టు యూరోప్‌లో శిక్షణ అనంతరం అక్కడి నుంచే నేరుగా జపాన్‌కు పయనమైంది. టోక్యో ఒలింపిక్స్ కోసం 228 మందితో కూడిన భారత బృందం జపాన్‌కు పయనమవుతుంది. భారత్ తరఫున 18 క్రీడాంశాల్లో మొత్తం 119 క్రీడాకారులు పోటీపడనున్నారు. ఇందులో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. మిగతా వారంతా కోచింగ్, ఫిజియో సిబ్బంది. ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఇంత పెద్ద జట్టు వెళ్లడం ఇదే తొలిసారి.
మరో ఆరు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ 2021 క్రీడా సంబరం మొదలవనున్న వేళ.. నిర్వాహకులకు భారీ షాక్ తగిలింది. శిక్షణ శిబిరంలో ఉన్న ఉగాండా అథ్లెట్ ఒకరు అదృశ్యమయ్యాడు. ఉగాండా వెయిట్ లిఫ్టర్ జూలియస్ సెకిటోలెకో హోటల్ నుంచి అదృశ్యమయ్యాడు. ఈ విషయం ఒలింపిక్స్ నిర్వాహకుల్లో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తితో సతమతమవుతున్న నిర్వాహకులను అథ్లెట్ అదృశ్యం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. జపాన్ పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తోంది.