
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో బరిలోకి దిగుతున్న భారత ప్లేయర్లకు నిర్వహకులు పసందైన భోజనం అందిస్తున్నారు. మనోళ్లందరికి క్రీడా గ్రామంలోని భోజనం బాగా నచ్చిందట. గత ఒలింపిక్స్ అనుభవాలకు భిన్నంగా ఈసారి నిర్వాహకులు భోజనాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారట. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్లేయర్ కూడా నియమాలు పాటిస్తున్నారట. ఈ విషయాన్ని పలువురు క్రీడాకారులు తమతమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేశారు. జూన్ 23న టోక్యో ఒలింపిక్స్ ఆరంభం కానున్నాయి.
ఉత్తర భారతీయులు బాగా ఆస్వాదించే ఛోలే భటూరే, బట్టర్, ప్లెయిన్ నాన్స్, పరాఠ, బట్టర్ చికెన్, టోఫు (సోయా పనీర్), షాహి పనీర్ (కాటేజ్ చీజ్), భింది, బాస్మతి, జాస్మిన్ రైస్, బిర్యానీతో టోక్యో ఒలింపిక్స్ నిర్వహకులు మెనూ రూపొందించారు. మంచి ప్రోటీన్ విలువలు కల్గిన భోజనాన్ని ప్లేయర్లకు అందుబాటులో ఉంచారు. టోక్యో గేమ్స్ విలేజ్‌లోని భోజనం చాలా బాగుందని భారత డిప్యూటీ చెఫ్ డీ మిషన్ ప్రేమ్ వర్మ పేర్కొన్నారు. అథ్లెట్లు ఎక్కడా ఇబ్బందులు పడకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
భారత్ సహా ప్రపంచ దేశాల ఆహారాన్ని వడ్డిస్తున్నారని ప్రేమ్ వర్మ చెప్పారు. క్రీడా గ్రామంలో రెండు అంతస్తుల్లో భోజన ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం కోసం సీటు సీటుకు మధ్య ఫైబర్ గ్లాసును ఏర్పాటు చేశారు. అయితే వేడినీళ్లు తాగేందుకు కరెంట్ ఫ్లాస్కులు కావాలని భారత జట్టు కోరింది. దాంతో జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఈ విన్నపాన్ని నిర్వాహక కమిటీకి తెలియజేసినట్టు ప్రేమ్ వర్మ చెప్పారు. పారిశుధ్య సిబ్బందితో కాంటాక్టును సాధ్యమైనంత తక్కువ చేసేందుకు క్రీడా గ్రామంలో ప్రతి గదిని మూడు రోజులకోసారి శుభ్రం చేయించాలని నిర్వాహకులు నిర్ణయించారు. కానీ రోజూ శుభ్రం చేయాలని భావిస్తే.. ఆ మేరకు నిర్వాహకులకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఒలింపిక్స్ కోసం ఇప్పటికే క్రీడా గ్రామంలో అడుగుపెట్టిన భారత అథ్లెట్లు ప్రాక్టీస్ మొదలెట్టారు. స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయిప్రణీత్‌తో పాటు ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఆచంట శరత్‌కమల్, సత్యన్, జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ సోమవారం సాధన షురూ చేశారు. సింగిల్స్ కోచ్ పార్క్ సంగ్ పర్యవేక్షణలో సింధు, ప్రణీత్ సాధన చేయగా.. డబుల్స్ స్పెషలిస్టులు చిరాగ్‌శెట్టి, సాత్విక్ సాయిరాజ్‌లు కోచ్ మతియాస్ బో ఆధ్వర్యంలో చెమటోడ్చారు. స్థానిక యుమెనోషిమా పార్కులో ఆర్చరీ జంట దీపిక, అతానుదాస్.. టీటీ క్రీడాకారులు శరత్‌కమల్, సత్యన్ సాధనలో మునిగిపోయారు. రోయర్లు అర్జున్ లాల్, అరవింద్ సింగ్ సాధన సాగించారు.