
హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ 2020 చివరి రోజు ఆగస్టు 8 అయినప్పటికీ.. భారత్ పోటీలు శనివారంతో ముగియనున్నాయి.16వ రోజు భారత్‌కు 3 పతకాలు వచ్చే అవకాశముంది. మొత్తం 3 పతకాంశాల్లో పోటీపడుతుండగా.. అన్నింటిపైనా ఆశలున్నాయి. శనివారం జరిగే పోటీల్లో పురుషుల ప్లేయర్ నీరజ్ చోప్రా బరిలోకి దిగనుండగా.. రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా కాంస్యం కోసం పోరాడనున్నాడు. ఇక గోల్ఫ్‌లో అదితి అశోక్‌కు కూడా రజతం లభించే అవకాశం ఉంది. భారత్‌కు ఒలింపిక్స్ 2020లో 5 పతకాలు (2 రజతాలు, 3 కాంస్యాలు) వచ్చిన విషయం తెలిసిందే. చివరిరోజు మరో రెండు పతకాలు సాధించినా.. మెగా క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలవనుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలు సాధించింది.
మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 4 మ్యాచ్ కోసం భారత్ తరఫున అదితి అశోక్, దీక్షా దగర్ పాల్గొననున్నారు. దీక్షా దగర్ ఉదయం 4.17 గంటల నుంచి, అదితి అశోక్ 4.48 గంటలకు నుంచి మ్యాచ్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ శుక్రవారం జరగాల్సి ఉండగా.. వాతవరణ సమస్యల కారణంగా శనివారానికి వాయిదా పడింది. ఒకవేళ రేపు కూడా మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే.. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితికి రజతం లభిస్తుంది. అప్పుడు తొలిసారి భారత్‌కు గోల్ఫ్‌లో పతకం సాధించిన అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టిస్తుంది.
శుక్రవారం జరిగిన రౌండ్ 3 మ్యాచ్‌లో రెండో స్థానంలో నిలిచిన అదితి అశోక్.. ఈ ఈవెంట్లో రజతం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం మూడు రౌండ్ల తర్వాత రెండో స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన నెల్లి కొర్డా మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా హన్నా గ్రీన్, న్యూజిలాండ్‌కు చెందిన లైడియా మూడో స్థానంలో ఉన్నారు. ఇక పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగం సెమీస్లో ఓడిపోయిన బజరంగ్ పునియా కాంస్యం కోసం పోరాడనున్నాడు. ఈ మ్యాచ్ సాయంత్రం 3.15 గంటల తర్వాత ప్రారంభం కానుంది.
పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో సత్తాచాటిన నీరజ్ చోప్రా.. తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌కు ఎంపికయ్యాడు. ఈ ఒలింపిక్స్‌లో నీరజ్ కచ్చితంగా పతకం గెలుస్తాడనే నమ్మకంతో అందరూ ఉన్నారు. క్వాలిఫికేషన్ రౌండ్లో జావెలిన్‌ను ఏకంగా 86.59 మీ.(83 మీ. విసిరితే అర్హత) విసిరి ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరుతో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత పోటీలు ముగియనున్నాయి. నీరజ్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో.. అతడు భారత్‌కు గోల్డ్ మెడల్ తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఒడిశాకు చెందిన మానస్ కుమార్ సాహో అనే ఆర్టిస్ట్ బీచ్‌లో సైకత శిల్పాన్ని రూపొందించాడు. యావత్ భారతం స్వర్ణ పతకం కోసం ఎదురుచూస్తోందని రాసుకొచ్చాడు.