
టోక్యో: జపాన్‌లో ప్రతిష్ఠాత్మకం ఒలింపిక్స్ 2021 ఈవెంట్ ఆరంభమైంది. రాజధాని టోక్యో సహా ఎంపిక చేసిన నగరాల్లో ఈ ఈవెంట్స్ కొనసాగుతోన్నాయి. వచ్చేనెల 8వ తేదీన ముగియనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న కట్టుదిట్టమైన నిబంధనల మధ్య అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. ఒలింపిక్స్ తొలి రోజు భారత్ నిరాశ పరిచింది. అర్చరీలో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయింది. అర్చరీ మహిళ విభాగం తొలి రౌండ్‌లో వరల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ నెల 27, 28వ తేదీల్లో మలి విడత రౌండ్లలో ఆమె పాల్గొనాల్సి ఉంది.
ప్రేక్షకుల్లేకుండా కొనసాగుతోన్న ఒలింపిక్స్ కోసం టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్.. సరికొత్తగా ఎమోజీని సృష్టించింది. ఇదివరకు భారత అథ్లెట్ల కోసమే ప్రత్యేకంగా ఎమోజీలను అందుబాటులోకి తీసుకుని వచ్చిన ట్విట్టర్.. తాజాగా ఒలింపిక్స్ కోసం మరొకటిని రూపొందించింది. విజయాలను సాధించిన వారిని అభినందించే హారాన్ని పోలి ఉండేలా ఈ ఎమోజీకి రూపకల్పన చేసింది ట్విట్టర్ యాజమాన్యం. ట్విట్టర్‌లో ఒలింపిక్స్ హ్యాష్‌ట్యాగ్ ఇవ్వగానే ఇది ప్రత్యక్షమౌతుంది.

సోషల్ మీడియా యూజర్లకు ఎమోజీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఒక్క క్లిక్‌తో తమ భావాలను పంచుకోవడానికి, వైఖరిని స్పష్టం చేయడానికి వీలుగా రూపుదిద్దుకున్నాయవి. కామెంట్లకు బదులుగా ఎమోజీలను వినియోగిస్తుంటారు యూజర్లు. అన్ని భావాలను ప్రతిబింబించేలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్స్ వాటికి రూపాన్ని ఇచ్చాయి. ఈ ఎమోజీలను వినియోగించని సోషల్ మీడియా యూజర్ బహుశా ఉండరనే అనుకోవచ్చు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఎమోజీని.. అంతే ప్రాధాన్యత ఉన్న ఒలింపిక్స్ కోసం తయారు చేసింది.
అక్కడితో ఆగలేదు ట్విట్టర్. ఒలింపిక్స్ క్రీడలు అనే పదాలను 30 భాషల్లో అందుబాటులోకి తీసుకుని వచ్చింది. వేర్వేరు దేశాలకు చెందిన భాషల్లో యూజర్లు హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ట్వీట్ చేయడానికి వెసలుబాటును కల్పించింది. హ్యాష్‌ట్యాగ్ ఇవ్వగానే ఆయా భాషలకు చెందిన పదాలు ప్రత్యక్షమౌతాయి. యూజర్లు అందులో తమకు నచ్చిన లాంగ్వేజీని వినియోగిచుకుని ట్వీట్ చేసే సౌలభ్యాన్ని ట్విట్టర్ కల్పించింది. ఒలింపిక్స్ కోసం 30 భాషల్లో ట్వీట్‌కు ఆ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్ రూపకల్పన చేయడం ఇదే తొలిసారి.