
టోక్యో: విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌లో నాలుగో రోజు భారత్ శుభారంభం చేసింది. విజయంతో తన పతకాల వేటను ప్రారంభించింది. ఫెన్సింగ్‌లో విజయాన్ని అందుకుంది భారత్. అదే సమయంలో- పురుషుల అర్చరీలో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఎలిమినేషన్ రౌండ్‌లో అర్చర్లు అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ విజయం సాధించారు. కజకిస్తాన్‌కు చెందిన అబ్దుల్లిన్ ఇల్ఫత్, గంకిన్ డెనిస్, ముస్సయేవ్‌ను 6-2 తేడాతో ఓడించారు. ఈ ఉదయం 10:15 నిమిషాల భారత అర్చర్ల త్రయం దక్షిణ కొరియా అర్చర్లను ఢీ కొట్టాల్సి ఉంది.
మహిళల ఫెన్సింగ్ వ్యక్తిగత సబ్రే టేబుల్ 64 విభాగంలో భారత్ గొప్ప విజయాన్ని సాధించింది. భారత స్టార్ ఫెన్సర్ చదలవాడ ఆనంద సుందరరామన్ భవానీ దేవి.. భవానీ అవతారం ఎత్తారు. మహిళల వ్యక్తిగత సబ్రె కేటగిరీలో ట్యునీషియాకు చెందిన బెన్ అజీజీ నాదియాను ఓడించారు. 15-3 తేడాతో తన ప్రత్యర్థిని ఓడించారు భవానీ దేవి. ఆరు నిమిషాల 14 సెకెండ్లలో మ్యాచ్‌ను ముగించేశారంటే ఆమె ఏ స్థాయిలో దూకుడు ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ ర్యాంకింగ్స్‌లో 42వ స్థానంలో కొనసాగుతోన్నారు చదలవాడ భవానీదేవి. ఫెన్సింగ్ విభాగంలో భారత్ తొలి రౌండ్‌లో విజయం సాధించడం ఇదే తొలిసారి.
తన కంటే జూనియర్.. ర్యాంకింగ్‌లో 384వ స్థానంలో ఉన్న ట్యూనియషియన్ యంగ్‌స్టాన్ నాదియాపై ఏకపక్షంగా విజయం సాధించారు. భవానీ దేవి ఎనిమిది పాయింట్లను సాధించేంత వరకూ నాదియా.. కనీసం తన ఖాతాను కూడా తెరవలేకపోయారు. సెకెండ్ హాఫ్‌లోనూ అదే పరిస్థితి కనిపించింది. చదలవాడ భవానీదేవి దూకుడును ఏ మాత్రం అడ్డుకోలేకపోయారు నాదియా. ఈ విజయంతో భవానీ దేవి 64వ టేబుల్ నుంచి 34వ టేబుల్ రౌండ్‌కు దూసుకెళ్లారు. ఇంకాస్సేపట్లో ఈ రౌండ్‌లో ఆమె ఫెన్సింగ్ ఫోర్త్ సీడ్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. ఈ రౌండ్‌లో ఆమె ఫ్రెంచ్ స్టార్ ఫెన్సర్ ఎం బ్రునెట్‌ను ఎదుర్కొంటారు.