
టోక్యో: క్రీడారంగంలో అత్యున్నతమైన ఈవెంట్‌గా భావించే ఒలింపిక్స్.. గడువు సమీపించింది. జపాన్ కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రతిష్ఠాత్మకమైన స్పోర్ట్స్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. జపాన్ రాజధాని టోక్యో సహా ఎంపిక చేసిన నగరాల్లో దీన్ని నిర్వహిస్తోన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులను అనుమతించట్లేదు అక్కడి ప్రభుత్వం. ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు ఈ సాయంత్రం ఆరంభం కానున్నాయి. భారత్ తరఫున 127 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొంటోన్నారు.
అర్చరీ, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, ఫెన్సింగ్, హాకీ, బాక్సింగ్, జావెలిన్ థ్రో, రేస్ వాక్, లాంగ్‌జంప్ ఇలా 18 ఈవెంట్లలో భారత్ పాల్గొనబోతోన్నారు. ఇందులో అర్చెరీతో భారత ఒలింపిక్స్ ప్రస్థానం ప్రారంభమైంది. ప్రపంచ నంబర్ వన్ దీపికా కుమారి ఈ విభాగానికి భారత్ తరఫున ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఈ కేటగిరీలో మొత్తం వేర్వేరు దేశాలకు చెందిన 64 మంది పాల్గొంటోన్నారు. వారందరితో దీపికా కుమారి, అతాను దాస్ పోటీ పడుతోన్నారు. జపాన్ కాలమానం ప్రకారం.. ఉదయం 9 గంటలకు యుమెనోషిమా ర్యాంకింగ్ ఫీల్డ్‌లో అర్చరీ ఆరంభమైంది.
మొదటి రోజు అర్చరీతోనే ముగుస్తుంది. మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్ అర్చరీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుంది. ఒంటిగంట నుంచి అదే యుమెనోషిమా ర్యాంకింగ్ ఫీల్డ్‌లోనే పురుషులు ఇదే ఈవెంట్‌లో పాల్గొంటారు. ఈ విభాగం మొత్తం మీద అర్చర్లు 72 బాణాలను సంధించాల్సి ఉంటుంది. వారు సాధించిన పాయింట్ల ఆధారంగా మొదటి నుంచి 64 మందికీ ర్యాంకింగ్‌లను కేటాయిస్తారు ఒలింపిక్స్ నిర్వాహకులు. దీపికా కుమారికి 47 ఎ టార్గెట్‌ను కేటాయించారు. తొలి రౌండ్ ముగిసే సరికి ఆమె ఎనిమిదో స్థానంలో నిలిచారు.
ప్రధానంగా దీపికా కుమారికి కొరియాకు చెందిన కాంగ్ ఛాయెయంగ్, అన్ సాన్, తైపేకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న యా-టింగ్, లెయ్ చెయిన్-యింగ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందనే అంచనాలు ఉన్నాయి. భారత్ ఖచ్చితంగా పతకాన్ని ఆశించే విభాగం ఇది. దీపికా కుమారిపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఈ మధ్యాహ్నానికి తెలిసిపోతుంది. అర్చరీలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోన్నందున దీపికా కుమారి అంచనాలకు అనుగుణంగా రాణిస్తారనే ఆశిస్తున్నారు అభిమానులు. మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్‌లో ఆమె జోరు చూపిస్తారని భావిస్తోన్నారు.