
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో చైనా మహిళా స్మిమ్మర్లు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 4×200 మీటర్ల రిలే ఈవెంట్‌లో హాట్ ఫేవరెట్స్ అయిన అమెరికా, ఆస్ట్రేలియాలను వెనక్కి నెట్టడమే కాకుండా.. ఏకంగా ప్రపంచ రికార్డుతో గోల్డ్ మెడల్ గెలిచారు. చైనాకు చెందిన యాంగ్ జున్‌జువాన్, ఝాంగ్ యుఫెయి, లి బింగ్జీ, తాంగ్ ముహాన్ టీమ్.. 7 నిమిషాల 40.33 సెకన్లలో ఈ రిలేను పూర్తి చేయడం విశేషం. అమెరికా టీమ్ (7:40.73), ఆస్ట్రేలియా టీమ్ (7:41.29) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
4×200 మీటర్ల ఈవెంట్ 1996లో తొలిసారి ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి అమెరికా, ఆస్ట్రేలియా మహిళలే ఆధిపత్యం చెలాయించారు. ప్రతిసారి వారికే గోల్డ్ మెడల్ దక్కేది. అమెరికా, ఆస్ట్రేలియా కాకుండా మరో టీమ్ గోల్డ్ గెలవడం ఇదే తొలిసారి. అయితే ఇప్పుడీ మూడు టీమ్స్ గత వరల్డ్ రికార్డ్ టైమ్ (7:41.50)లోపే పోటీని పూర్తిచేయడం విశేషం. గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఆస్ట్రేలియా ఈ రికార్డు సెట్ చేసింది. చివరి లెగ్‌లో అమెరికా స్టార్ స్విమ్మర్ కేటీ లెడెక్కీ టీమ్‌ను గోల్డ్ వైపు నడిపించేలా కనిపించినా.. చివరికి చైనానే స్వర్ణం ఎగరేసుకుపోయింది. 200 మీటర్ల బట్టర్ ఫ్లై ఈవెంట్‌లో చైనా ప్లేయర్ చాంగ్ యుఫీ గోల్డ్ గెలిచింది.
ఇక ఒలింపిక్స్ 2021లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా వరల్డ్ పోల్ వాల్ట్ చాంపియన్, అమెరికన్ సామ్ కెండ్రిక్స్ కరోనా బారిన పడి ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. దీంతో పోటీల్లో పాల్గొనకుండానే అతను వెనుదిరగనున్నాడు. అథ్లెట్ల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, కెండ్రిక్స్ కరోనా బారిన పడ్డాడని చెప్పడానికి చింతిస్తున్నామని అమెరికా ఒలింపిక్ కమిటీ చెప్పింది. మరోవైపు మొత్తం ఆస్ట్రేలియా ట్రాక్ అండ్ ఫీల్డ్ టీమ్ ఐసోలేషన్‌లో ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీమంతా ఐసోలేషన్‌లో ఉన్నట్లు మేనేజ్‌మెంట్ చెప్పింది.