
టోక్యో: భారత యువ ఆటగాడు నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అథ్లెటిక్స్‌లో శతాబ్దం తర్వాత భారత్‌కు తొలి పతకం అందించాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా శనివారం స్వర్ణ పతకం ముద్దాడాడు. దీంతో భారత దేశంలో వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు. ఇక అథ్లెట్లకు అందని కలగా ఉన్న గోల్డ్ మెడల్‌ను సాధించి భారతదేశ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో 87.58 మీటర్ల దూరం త్రో చేసి రికార్డు క్రియేట్ చేశాడు. అయితే తన గోల్డ్ మెడల్‌ను భారత క్రీడా దిగ్గజం మిల్కా సింగ్‌కు అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు.
'దిగ్గజం మిల్కా సింగ్ ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతాన్ని వినాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన మనతో లేరు. కానీ మిల్కా సింగ్ కల మాత్రం నెరవేరింది. నేను ఈ మెడల్‌ను ఆయనకు అంకితం ఇస్తున్నా. ఆయన ఎక్కడ ఉన్నా.. నన్ను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని నేను భావిస్తున్నా. అథ్లెటిక్స్‌లో భారత్ గోల్డ్ మెడల్ గెలవడం ఇదే తొలిసారి. కాబట్టి నాకే కాదు యావత్ భారత దేశమంతా గర్వించదగ్గ విషయం ఇది' అని గోల్డ్ మెడల్ గెలిచిన అనంతరం నీరజ్ చోప్రా అన్నాడు.
స్ప్రింట్ లెజెండ్ మిల్కా సింగ్ తనయుడు జీవ్ మిల్కా సింగ్ కూడా నీరజ్ చోప్రా విజయంపై స్పందించారు. 'భారత్ గోల్డ్ మెడల్ సాధించాలని నాన్న చాలా సంవత్సరాలు వేచి చూశారు. చివరికి భారత్ మొదటిసారి అథ్లెటిక్స్‌లో స్వర్ణం గెలుచుకుంది.నాన్న కల నెరవేరింది. నేను ఈ ట్వీట్ చేస్తున్నప్పుడు ఏడ్చాను. పైన ఉన్న నాన్న కూడా ఏడుస్తున్నాడని ఖచ్చితంగా అనుకుంటున్నా. ఇది జరిగినందుకు ధన్యవాదాలు' అని జీవ్ పోస్ట్ చేసారు. మిల్కా సింగ్ రెండు నెలల క్రితం కరోనాతో పోరాడి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మిల్కా ఆసియా అథ్లెటిక్స్‌లో నాలుగుసార్లు స్వర్ణం నెగ్గారు. 1958 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి గెలిచారు. 1960 రోమ్ ఒలింపిక్స్ 400 మీటర్ల పరుగులో త్రుటిలో పతకం కోల్పోయారు.
తాను అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం వల్ల ఫైనల్స్‌లో ఒత్తిడికి గురి కాలేదని నీరజ్ చోప్రా చెప్పాడు. నీరజ్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ... 'అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనడం వల్ల తొలి థ్రో 87.03 మీటర్లకు వెళుతుందని విశ్వాసంతో ఉన్నా. థ్రో తర్వాత ఒలింపిక్స్ రికార్డు 90.57 మీటర్లు అని భావించా. నా వ్యక్తిగా బెస్ట్ రికార్డు 88.07 మీటర్లు. తదుపరి తన లక్ష్యం 90 మీటర్ల దూరం దాటాలని పెట్టుకున్నా. కరోనా వల్ల టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదా పడటాన్ని నెగెటివ్‌గా తీసుకోలేదు. ఈ టోర్నీకి ప్రిపేర్ కావడానికి మరో ఏడాది టైం దొరికిందని భావించా' అని చెప్పాడు.