
టోక్యో: విశ్వ క్రీడల్లో ఈసారి నాలుగు కొత్త క్రీడాంశాలు అరంగేట్రం చేయనున్నాయి. దీంతో ఒలింపిక్స్ చరిత్రలోనే అతి పెద్ద క్రీడలుగా టోక్యో ఒలింపిక్స్ 2021 రికార్డు సృష్టించబోతోంది. స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, కరాటే క్రీడలకు తొలిసారి ఒలింపిక్స్‌లో చోటు దక్కింది. జపాన్‌లో అత్యంత ఆదరణ కలిగిన కరాటేకు ఈ క్రీడల్లో స్థానం ఇస్తున్నా.. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం కరాటేను కొనసాగించడం లేదు. మరోవైపు 2008 బీజింగ్ ఒలింపిక్స్ తర్వాత బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ క్రీడలు పునరాగమనం చేస్తున్నాయి.
నాలుగు క్రీడలకు ఈసారి ప్రవేశం కల్పించడంతో టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు ప్రదానం చేసే ఈవెంట్ల సంఖ్య 339కి పెరిగింది. సంప్రదాయ ఆత్మరక్షణ క్రీడ అయిన కరాటే 1868లో జపాన్‌లో పుట్టింది. కటా, కుమిటే విభాగాలుగా పోటీలు నిర్వహిస్తారు. పురుషులు, మహిళలల్లో మూడు వెయిట్ కేటగిరీలలో పోటీలుంటాయి. 2024 ఒలింపిక్స్‌లో మాత్రం కరాటేను కొనసాగించడంలేదు. అలానే ఈ ఒక్కసారి మాత్రమే బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ క్రీడలు జరగనున్నాయి.
స్కేట్‌బోర్డింగ్ క్రీడా అమెరికాలో బాగా పాపులర్. ఈ క్రీడలో విన్యాసాలు ఒళ్లు గగుర్పొడుస్తాయి. అందుకే దీనిని 'యాక్షన్ స్పోర్ట్' అని పిలుస్తారు. పారిస్ ఒలింపిక్స్‌లోనూ ఈ క్రీడను కొనసాగించనున్నారు. పార్క్, స్ట్రీట్ అనే రెండు విభాగాల్లో పతకాలు ప్రదానం చేస్తారు. పార్క్ విభాగంలో.. డోమ్‌లా ఉండే స్టేడియంలో స్కేటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. స్ట్రీట్ కేటగిరిలో.. మెట్లు, రెయిలింగ్ మీద నుంచి స్కేట్‌బోర్డింగ్ చేయాలి.
ఉవ్వెత్తున ఎగసే అలల మధ్య సాగే సాహస క్రీడ సర్ఫింగ్. పురుషులు, మహిళల విభాగాలలో పోటీలు ప్రీలిమినరీ హీట్స్, హెడ్ టు హెడ్ నాకౌట్ రౌండ్‌లలో నిర్వహిస్తారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ ఈ క్రీడ జరగనుంది. ఇక స్పోర్ట్ క్లైంబింగ్.. రాక్ క్టైంబింగ్ లాంటి దే. స్పీడ్, బౌల్డరింగ్, లీడ్ అనే మూడు విభాగాల సమాహారంగా ఈ క్రీడ జరుగుతుంది. మూడు విభాగాలలో ఆధిక్యం కనబరిచిన వారిని పురుషులు, మహిళల్లో విజేతలుగా నిర్ధారిస్తారు. పారిస్ క్రీడల్లోనూ ఇది కొనసాగనుంది.