
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో అయిదో రోజు భారత్ దాదాపు అన్ని ఈవెంట్లలోనూ పరాజయాల బారిన పడింది. ఒకదాని వెంట ఒకటి అపజయాలు భారత్‌ను వెంటాడాయి. ఒక్క హాకీలో తప్ప.. మరెందులోనూ విజయాన్ని రుచి చూడలేకపోయింది భారత్. తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్ విభాగాన్ని విజయంతో ఆరంభించినప్పటికీ.. ఆ వెంటనే వరుస ఓటములను చవి చూసింది. పురుషుల టేబుల్ టెన్నిస్‌లో ఓడింది. బ్యాడ్మింటన్ డబుల్స్‌లో గెలిచినా.. ముందుకు వెళ్లలేని పరిస్థితిని భారత్ ఎదుర్కొంది.
ఇన్ని వరుస పరాజయాల పరంపర మధ్య ఓ విజయాన్ని అందుకుంది భారత్. అదీ బాక్సింగ్‌లో. మహిళల వెల్టర్‌వెయిట్ ప్రిలిమినరీస్ 64-69 కేజీల విభాగంలో భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ చిరస్మరణీయ గెలుపును అందుకున్నారు. ఈ రౌండ్‌లో ఆమె జర్మనీ బాక్సర్ న్యాడినే ఆప్టెజ్‌ను ఓడించారు. 3-2 తేడాతో గెలుపొందారు. ఏకంగా క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో బలమైన చైనీస్ తైపేకి చెందిన నియెన్-చిన్ చెన్‌తో తలపడాల్సి ఉంది.
టోక్యోలోని కొకుగికన్ బాక్సింగ్ ఎరీనాలో నిర్వహించిన ఈ ప్రిలిమినరీ రౌండ్ 16లో లవ్లీనా తన ప్రత్యర్థిపై పిడుగుల్లాంటి పంచ్‌లో విరుచుకుపడ్డారు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆపెట్జ్‌ను ఓడించారు. రెండు రోజుల కిందటే భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ తొలి రౌండ్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 48 కేజీలో విభాగంలో పోటీ పడిన మేరీ కోమ్.. డొమినికన్ రిపబ్లికన్‌కు చెందిన మెగ్వెలినా హెండర్సన్ గార్సియాను ఓడించారు. తన వయస్సులో సగం ఉన్న హెండర్సన్‌పై సుడిగాలి విజయాన్ని అందుకున్నారామె.
ఆ రెండో రోజే లవ్లీనా బొర్గోహెయిన్ బాక్సింగ్ రింగ్‌లో తన ప్రతాపం చూపారు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన లవ్లీనా.. తన తాహతుకు మించి శ్రమించినట్లు కనిపించింది. ఆపెట్జ్‌ను నిలురించడంలో అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించారు. కొన్ని కీలక బౌట్లలో పొరపాట్లు చేసినప్పటికీ.. కౌంటర్ అటాక్ ఇవ్వడంలో విజయవంతం అయ్యారు. తన దూకుడు ప్రతి రౌండ్‌కూ కొనసాగించారు. రౌండ్ రౌండ్‌కూ ఫుల్ ఎనర్జీతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డారు.