
13 ఏళ్ల తర్వాత:
భారత జాతీయ గీతానికి సంబందించిన వీడియోను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతం వినిపించడంతో అందరూ భావోద్వేగం చెందారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన గంట వ్యవధిలోనే లక్షకు పైగా నెటిజనులు వీక్షించారు. అంతేకాకుండా నీరజ్ చోప్రాకు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తూ అభినందనలు తెలుపుతున్నారు. తొలి ప్రయత్నంలో చోప్రా జావెలిన్‌ను 87.03 మీటర్లకు విసిరాడు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లకు విసిరారు. రెండో స్థానంలో నిలిచిన చెక్ రిపబ్లిక్‌కు ప్లేయర్ వడ్లెక్ గరిష్ఠంగా 86.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన విటెజ్‌స్లావ్ వెస్లీ గరిష్టంగా 85.44 మీటర్లకు జావెలిన్‌ను విసిరి మూడో స్థానంలో నిలిచాడు.

6 కోట్ల భారీ నగదు ప్రోత్సాహం:
ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశంలో ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన నీరజ్‌కు హర్యానా సర్కారు రూ.6 కోట్ల భారీ నగదు ప్రోత్సాహం ప్రకటించింది. ఈ క్షణాల కోసమే యావత్ భారతావని చాలా ఏళ్లుగా ఎదురుచూస్తోందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ శనివారం ట్వీట్ చేశారు. తెలిపారు. దేశమంతా నీరజ్ విజయం పట్ల గర్వంగా ఉందన్నారు. 23 ఏళ్ల నీరజ్ అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. దాంతో భారత్‌కు ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో 100 ఏళ్ల తర్వాత తొలి స్వర్ణం వచ్చినట్లయ్యింది.

చిరకాలం గుర్తుంటుంది:
'నీరజ్ చోప్రా.. ఇది అద్వితీయమైన గెలుపు. స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించావు. తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొని భారత్‌కు స్వర్ణ పతకం తీసుకొచ్చిన నీ ప్రతిభ.. ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకం. భారతదేశం నీ విజయానికి సంతోషిస్తోంది. హృదయపూర్వక అభినందనలు' అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ ట్వీట్ చేశారు. 'టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. ఈరోజు నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడం చిరకాలం గుర్తుంటుంది. చాలా బాగా రాణించారు. ఒక ప్యాషన్‌తో తనదైన శైలిలో ఆడిన నీరజ్‌కు నా అభినందనలు' అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఓవరాల్‌గా ఏడు పతకాలు:
నీరజ్ చోప్రా గోల్డ్‌తో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది. రెజ్లింగ్ విభాగంలో రవికుమార్ దహియాకు సిల్వర్, భజరంగ్ పూనియాకు బ్రాంజ్ మెడల్స్ దక్కాయి. వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాభాయి చానుకు సిల్వర్ దక్కగా.. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధుకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్‌కు కాంస్యం దక్కింది. ఇండియన్ మెన్స్ హాకీ టీమ్‌కు కూడా బ్రాంజ్ మెడల్ వచ్చిన విషయం తెలిసిందే. ఇంతకముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అయితే దీనిని పక్కకు తోస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరింత అద్బుతంగా ఆడింది. ఓవరాల్‌గా ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది.


Click it and Unblock the Notifications












