
హైదరాబాద్: 2020లో జరగనున్న ఒలింపిక్స్‌కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఒలింపిక్స్‌లో విజేతలకు ప్రదానం చేసే పతకాలను ఆతిథ్య దేశం జపాన్ బుధవారం విడుదల చేసింది. సరిగ్గా ఏడాది వ్యవధి ఉన్న నేపథ్యంలో బుధవారం రాజధాని టోక్యోలో దేశ ప్రజలు పతకాలను చూసేందుకు వీలు కల్పించారు.
మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్
దీంతో టోక్యో వ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అభిమానులు, స్పాన్సర్లు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. జపాన్ ప్రధాని షింజో అబేతో పాటు 1976 క్రీడల ఫెన్సింగ్ స్వర్ణ పతక విజేత, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ పాఠశాల విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మరో 365 రోజులే అంటూ అభిమానులు ఫ్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. జులై 24న ఆరంభమయ్యే ఈ ఒలింపిక్స్ కోసం కొత్తగా నిర్మిస్తున్న ఎనిమిది స్టేడియాలకు గాను ఐదు స్టేడియాల నిర్మాణం ఇప్పటికే పూర్తి అయింది. ఒలింపిక్స్ ప్రధాన స్టేడియం ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానుంది.
మొత్తం 20 బిలియన్ డాలర్ల వ్యయంతో ఒలింపిక్స్ నిర్వహించాలని జపాన్ ప్రణాళికలు వేస్తోంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సభ్యుడైన జాన్ కోట్స్ మాట్లాడుతూ "ఒలింపిక్స్‌పై ఆతృత పెరుగుతోంది. టికెట్ల అమ్మకాల్లో ఘనమైన పెరుగుదల కనిపిస్తోంది" అని పేర్కొన్నాడు.