కొందరు ప్రేక్షకుల వైఖరిపై యువ చెస్ ప్లేయర్ దివ్యా దేశ్‌ముఖ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆటను కాకుండా ఇతర విషయాలపై కొందరు ఎక్కువగా దృష్టిపెడుతూ ఇబ్బంది కలిగించారని దివ్యా తన ఆవేదన వెల్లడించారు. ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో పాల్గొన్న ఆమె అక్కడ ఎదురైన చేదు అనుభవాలు వివరించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆ విషయాలను తెలిపింది.
''ఈ విషయాన్ని ఎప్పటి నుంచో తెలియజేయాలనుకున్నా. కానీ టోర్నమెంట్ ముగిసిన తర్వాత చెప్పాలని నిర్ణయించుకుని ఆగిపోయా. చెస్‌లో ఉమెన్స్ ప్లేయర్లపై ప్రేక్షకులు ఎలా వ్యవహరిస్తారో గమనించాను. ఇది వ్యక్తిగతంగా ఎదురైన చేదు అనుభవం. ఈ టోర్నీలో కొన్ని గేమ్స్ ఆడాను. వాటిల్లో నా ప్రదర్శన పట్ల ఎంతో గర్వపడుతున్నా. అయితే కొందరు ప్రేక్షకులు ఆటను చూడకుండా నా దుస్తులు, కురులు, యాస వంటి అనవసర విషయాలపై దృష్టిపెట్టారని తెలిసింది''

''ఈ విషయం తెలిసిన తర్వాత ఎంతో బాధపడ్డా. మహిళలు చెస్ ఆడే సమయంలో సామర్థ్యాలు, ఆటను పట్టించుకోరనేది చేదు నిజం. నా ఆటపై కాకుండా ఇతర విషయాల గురించి చర్చిస్తున్నారని తెలిసిన తర్వాత ఎంతో నిరాశ చెందాను. కొందరు మాత్రమే ఆటపై శ్రద్ధ వహించడం బాధాకరం. ప్లేయర్, సామర్థ్యం గురించి కాకుండా వ్యక్తిగత విషయాల గురించి తక్కువ చేసి మాట్లాడం అన్యాయం''
''కానీ మెన్స్ విషయంలో ఇది జరగదు. మహిళలు ఈ పరిస్థితి ప్రతిరోజూ ఎదుర్కొంటున్నారని అనుకుంటున్నా. అయితే పురుషులతో పాటు మహిళలకు కూడా క్రీడల్లో సమాన హోదా దక్కాలని ఆశిస్తున్నా'' అని కర్ణాటక రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల దివ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. గతేడాది ఆసియా మహిళల చెస్ ఛాంపియన్‌షిప్ ఆమె గెలుచుకున్నారు. ఇటీవల జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో 4.5 స్కోర్‌తో 12వ ర్యాంకు సాధించారు.