రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ)కు వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సమాఖ్య పాలక మండలి వార్నింగ్ ఇచ్చింది. సమాఖ్య వ్యవహారాల్లో రాజకీయ జోక్యాన్ని త్వరగా ముగించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. లేదంటే మళ్లీ సస్పెన్షన్ వేటు విధించాల్సి వస్తుందని పేర్కొంది. డబ్ల్యూఎఫ్ఐ స్వయంప్రతిపత్తితో పని చేయాలని వెల్లడించింది.
ఈ మేరకు యూడబ్ల్యూడబ్ల్యూ ప్రెసిడెంట్ నేనాద్ లాలోవిక్.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ కు లేఖ రాశారు. "భారత రెజ్లింగ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించే విషయమై మాకు సరైన విధానం కావాలి. జాతీయ సమాఖ్యల కోసం పబ్లిక్ గ్రాంట్స్ ను వినియోగించే విషయమై మినహా, సమాఖ్య వ్యవహారాల్లోని అంతర్గత విషయాల్లో పబ్లిక్ లేదా పొలిటికల్ అధారిటీస్ జోక్యాన్ని యూడబ్ల్యూడబ్ల్యూ అంగీకరించదు. యూడబ్ల్యూడబ్ల్యూ రాజ్యంగంలోని 6.3 ఆర్టికల్ స్వయంప్రతిపత్తి వ్యవస్థ, స్వేచ్ఛను ఇచ్చింది. అది కచ్చితంగా ఫెడరేషన్స్ లోని ప్రతిఒక్కరూ పాటించాలి. కాబట్టి పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేయలేకపోతే, గతంలో విధించిన సస్పెన్షన్ ను మళ్లీ విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది." అని లాలోవిక్ లేఖలో పేర్కొన్నారు.

ఒకవేళ యూడబ్ల్యూడబ్ల్యూ రాజకీయ జోక్యం కారణంగా డబ్ల్యూఎఫ్ఐని సస్పెండ్ చేస్తే భారత రెజర్లు భవిష్యత్ లో అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొనే అర్హతను కోల్పోతారు. "ఇప్పటికే నేషనల్ క్యాంప్స్ ను సస్పెన్షన్ కారణంగా హోల్డ్ లో ఉంచారు. కాబట్టి మంత్రిత్వ ఖాఖ ఈ సస్పెన్షన్ సమస్యకు ముగింపు పలకపోతే, డబ్ల్యూఎఫ్ఐపై వేటు పడుతుంది. దీని వల్ల క్రీడవ్యవస్థకు, దేశంలోని రెజ్లర్లకు భారీ నష్టం కలుగుతుంది." అని డబ్ల్యఎఫ్ఐకి చెందిన ఓ ప్రతినిధి అన్నారు.
2023 ఆగస్టులో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్ చేసింది వరల్డ్ రెజ్లింగ్. అప్పటి డబ్ల్యూఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు అత్యాచార ఆరోపణలతో పాటు ఆందోళన బాట పట్టడంతో నిర్ణీత గడువులోపు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ఈ వ్యవహారం రాజకీయంగానూ పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఈ విషయంలో కేంద్ర క్రీడా శాఖ కూడా జోక్యం చేసుకుంది. దీంతో భారత రెజ్లింగ్ సమాఖ్యను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత గతేడాది ఈ సస్పెండ్ ను ఎత్తివేసింది యుడబ్ల్యూడబ్ల్యూ. కానీ సమాఖ్య వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఇంకా కొనసాగుతోందని, తొందరగా దీనికి ముగింపు పలకాలని, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదంటూ తాజాగా హెచ్చరించింది యుడబ్ల్యూడబ్ల్యూ.