
జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీల్లో తెలుగు తేజం ఆకుల శ్రీజ సంచలన విజయం సాధించింది. వరుసగా రెండోసారి జాతీయ మహిళల టేబుల్ టెన్నిస్ పోటీల్లో విజేతగా నిలిచింది. జమ్ము వేదికగా ముగిసిన జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్, డబుల్స్, టీమ్ ఈవెంట్ మూడింటిలో స్వర్ణ పతకాలు సాధిచింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. గతేడాది కామన్‌వెల్త్ క్రీడల్లో కూడా శ్రీజ అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే.
నేషనల్ టీటీ పోటీల్లో మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన శ్రీజ.. అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. ఈ క్రమంలోనే 4-2 (9-11, 14-12, 11-7, 13-11, 6-11, 12-10) పాయింట్లతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మాజీ చాంపియన్ సుతిరత ముఖర్జీని ఓడించింది. ఇక మహిళల డబుల్స్ విభాగంలో శ్రీజ-దియ జోడీ చెలరేగింది. వరుసగా 11-7, 11-7, 8-11, 14-12 తేడాతో మహరాష్ట్రకు చెందిన జోడీ స్వస్తికా ఘోష్-శ్రుతిపై నెగ్గి స్వర్ణం తమ ఖాతాలో వేసుకుంది.
మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా శ్రీజ మెరిసింది. ఈ విభాగంలో శ్రీజ - మనుష్ షా జోడీ సెమీఫైనల్‌లో పోరాడి ఓడింది. దీంతో ఈ జోడీ కేవలం కాంస్యంతో సరిపెట్టుకుంది. సెమీస్‌లో శ్రీజ జోడీ 9-11, 10-12, 12-10, 5-11తో మనవ్ - అర్చన ద్వయం చేతిలో ఓడింది. ఈ విభాగంలో మానవ్ టక్కర్ - అర్చన జోడీ విజేతగా నిలిచి పసిడి పతకం అందుకుంది. ఇక చివరగా టీమ్ ఈవెంట్‌లో శ్రీజ ప్రాతినిధ్యం వహించిన ఆర్‌బీఐ జట్టు బంగారు పతకం సాధించింది.
కాగా, గతేడాది బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్‌కమల్‌తో కలిసి ఆడిన శ్రీజ.. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో స్వర్ణంతో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ పోటీల్లో మహిళల సింగిల్స్‌లో కూడా శ్రీజ పతకం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ పోటీలో త్రుటిలో పతకం ఆమె చేజారింది. ఇదిలా ఉండగా.. పురుషుల డబుల్స్ ఫైనల్‌లో తెలంగాణ జోడీ మహ్మద్ అలీ-వన్ష్ సింఘాల్ జోడీ 6-11, 7-11, 6-11 తేడాతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన జీత్ చంద్ర - అంకుర్ భట్టాచార్జి చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో సాథియన్ రెండోసారి జాతీయ చాంపియన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు.