
హైదరాబాద్: సోషల్ మీడియాలో చురుగ్గా స్పందించే రాజకీయ నాయకుల్లో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒకరు. సాయం అర్థించిన వెంటనే తనదైన శైలిలో మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. అయితే, తాజాగా ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌ను సాయం కోరగా 'నా వల్ల కాదు బాబూ' అంటూ దండం పెట్టారు.
ఇంతకీ ఆ నెటిజన్ ఏం అడిగాడు? కేటీర్ ఎందుకు తన వల్ల కాదన్నారు? అనేగా మీ సందేహం.. వివరాల్లోకి వెళితే... శనివారం కేటీఆర్‌కు బట్టు సాయితేజ అనే యువకుడు ఇప్పటివరకూ ఎవరూ చేయలేని ట్విట్ చేశాడు. హైదరాబాద్ లో జరిగే SRH మ్యాచ్ కి సంబంధించిన మూడు IPL ఫ్రీ టికెట్స్ కావాలని ట్వీట్ చేశాడు.
దీంతో వెంటనే రిప్లై ఇచ్చిన కేటీఆర్ 'నావల్ల కాదు బాబు నీకో దండం' అంటూ నమస్కారం ఎమోజీతో ట్విట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. కేటీఆర్ స్పందనపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'మీలో ఫన్నీ యాంగిల్ కూడా ఉంది సర్' అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం 'ఆపదలో ఉన్నవారిని ఆదుకునే పనిలో బిజీగా ఉండే కేటీఆర్‌ను ఇలాంటి వచ్చిరాని ట్విట్ చేస్తావా?' అంటూ మండిపడుతున్నారు. 'కొంచెమైనా కామన్సెన్స్ లేదా ఇలాంటి వేస్ట్ మెసేజ్‌లతో కేటీఆర్‌గారి విలువైన సమయాన్ని వేస్ట్ చేయకండి' అంటూ పోస్టులు పెట్టారు.