
టోక్యో: ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడాభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన అథ్లెట్లు.. జపాన్ టెన్నిస్ స్టార్ నవొమి ఒసాకా, అమెరికన్ జిమ్నాస్ట్ సైమన్ బిల్స్. వారిద్దరూ తమ పూర్తిస్థాయి శక్తిసామర్థ్యాలను ప్రదర్శించకముందే.. ఈ మెగ ఈవెంట్‌ను వైదొలిగారు. లోకల్ టెన్నిస్ స్టార్ నవొమి ఒసాకా.. మహిళల సింగిల్స్ టెన్నిస్ కేటగిరీలో మూడో రౌండ్‌లో వెనుదిరిగారు. చెక్ రిపబ్లిక్ క్రీడాకారణి మార్కెటా వొండ్రౌసోవ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 6-1,6-4 వరుస సెట్ల తేడాతో పరాజయాన్ని చవి చూశారు.
తన స్వదేశంలో సాగుతోన్న ప్రతిష్ఠాత్మకగా ఒలింపిక్స్‌లో ఇంత త్వరగా ఎగ్జిట్ అవుతారని ఎవరూ ఊహించలేదు. అదే తరహాలో మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ కేటగిరీ నుంచి సైమన్ బిల్స్ అర్ధాంతరంగా వైదొలగారు. మానసిక ఒత్తిడి కారణంగా తాను ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇదివరకు వింబుల్డన్ టోర్నమెంట్ నుంచి ఇదే మానసిక ఒత్తిడి అనే కారణంతో నవొమి ఒసాకా వైదొలగిన విషయం తెలిసిందే.
అందులో నుంచి పూర్తిస్థాయిలో కోలుకోక ముందే నవొమి ఒసాకా ఒలింపిక్స్ ఈవెంట్‌లో పాల్గొనాల్సి రావడం ఆమె ఆటతీరును ప్రభావితం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. విమర్శలూ వెల్లువెత్తుతోన్నాయి. ఒలింపిక్స్ పూర్తిస్థాయిలో సమాయాత్తం కాలేదనే వ్యాఖ్యానాలు వినిపించాయి. ఈ పరిస్థితుల్లో ఉన్న ఆ ఇద్దరూ స్టార్ అథ్లెట్లకు భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి అండగా నిలిచారు. తన నైతిక మద్దతును ప్రకటించారు. ఎవ్వరికీ ఎలాంటి సంజాయిషిని ఇచ్చుకోవాల్సిన అవసరం లేదంటూ రవిశాస్త్రి సైమన్ బిల్స్‌కు సూచించారు.
చిన్న వయస్సులోనే సరైన నిర్ణయాన్ని సకాలంలో తీసుకున్నావని ప్రశంసించారు. 48 గంటలు లేదా 48 రోజులు.. ఇష్టమైనన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం ఓ ఛాంపియన్‌గా ఆవిర్భవించాలని అకాంక్షించారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సమాధానాన్ని గానీ, సంజాయిషీని గానీ ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు. నవొమి ఒసాకాకు కూడా ఇదే వర్తిస్తుందని సూచించారు. గాడ్ బ్లెస్ యు గర్ల్స్ అంటూ రవిశాస్త్రి తన బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారాయన.