స్వర్ణాధిక్యం సాధించేందుకు మరోసారి సిద్ధమైన చైనా

జకార్తా: ప్రపంచ స్థాయి ఈవెంట్ అయిన ఒలింపిక్స్‌లోనే చైనా కొన్ని పర్యాయాలుగా టాప్-3లో రాణిస్తూ వస్తోంది. అలాంటిది ఆసియా స్థాయిలో డ్రాగన్ సత్తా ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1982 మొదలు.. తొమ్మిది పర్యాయాలుగా ప్రతిసారీ ఆసియా క్రీడల్లో అగ్రస్థానం చైనాదే. సొంతగడ్డపై జరిగిన 2010 క్రీడల్లో చైనా అత్యధికంగా 199 స్వర్ణాలు సహా 416 పతకాలు సాధించి ఔరా అనిపించింది. ఐతే ఇంచియాన్ వేదికగా గత పర్యాయం జరిగిన క్రీడల్లో చైనా పతకాల సంఖ్య బాగా తగ్గింది.

200 స్వర్ణాలు లక్ష్యంగా బరిలోకి
ఆ క్రీడల్లో చైనా 151 స్వర్ణాలు సహా 345 పతకాలు సాధించింది. రెండో స్థానంలో నిలిచిన ఆతిథ్య దక్షిణ కొరియా కంటే చైనా 72 పసిడి పతకాలు ఎక్కువ సాధించిందంటే ఆ దేశం సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి జకార్తా వేదికగా ఈ శనివారం ఆరంభమయ్యే ఆసియా క్రీడల్లో చైనా ఎన్ని పతకాలు సాధిస్తుందన్నది ఆసక్తికరం. డ్రాగన్ 200 స్వర్ణాలు లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

బలమైన అథ్లెట్ల బృందాన్ని చైనా బరిలోకి
టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, సైక్లింగ్, డైవింగ్, జిమ్నాస్టిక్స్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్ వెయిట్‌లిఫ్టింగ్, వుషు, బ్యాడ్మింటన్ క్రీడల్లో చైనా తరఫున బలమైన క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. గత పర్యాయం ఈ క్రీడల్లోనే చైనా అధిక పతకాలు సాధించింది. అథ్లెటిక్స్‌లో అందరి దృష్టీ ఆసియాలోనే వేగవంతమైన స్ప్రింటర్‌గా రికార్డు సృష్టించిన యువ సంచలనం సు బింగ్టియాన్‌పైనే ఉంది. అతను ఇటీవలే 9.91 సెకన్లలో వంద మీటర్ల పరుగును పూర్తి చేసి రికార్డు నెలకొల్పాడు. అతడితో పాటు మరో 100 మీ. పరుగు వీరుడు జీ జెన్‌యె కూడా ఆకర్షణీయ అథ్లెటే. స్విమ్మింగ్‌లో సున్ యాంగ్ క్రీడలకే ప్రత్యేక ఆకర్షణ అనడంలో సందేహం లేదు. 866 మందితో భారీ, బలమైన అథ్లెట్ల బృందాన్ని చైనా బరిలోకి దించుతోంది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా:
బలమైన క్రీడా దేశాల్లో ఆసియాలో చైనా తర్వాత జపాన్ ఒకటి. ఆసియా క్రీడల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే జపాన్. రెండేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. ఆ మెగా ఈవెంట్లో మెరుపు మెరిపించాలన్న లక్ష్యంతో కొన్నేళ్ల కిందటి నుంచే క్రీడాకారుల్ని సన్నద్ధం చేస్తుంది. ఆసియా క్రీడల్ని తమ సత్తాకు పరీక్షగా భావిస్తోంది.
టోక్యో ఒలింపిక్స్‌లో 30 స్వర్ణాల్ని లక్ష్యంగా పెట్టుకున్న జపాన్.. ప్రస్తుత క్రీడల్లో అంతకు రెట్టింపు పసిడి పతకాలు ఆశిస్తోంది.

దక్షిణకొరియా.. ఇండోనేషియాలు కూడా:
జపాన్ తక్కువమందినే బరిలోకి దించుతున్నప్పటికీ.. పోటీ పడే ప్రతి ఈవెంట్లోనూ బలమైన క్రీడాకారులే ఉన్నారు. ఆఖరిసారి సొంతగడ్డపై జరిగిన క్రీడల్లో 79 స్వర్ణాలతో రెండో స్థానంలో నిలిచిన దక్షిణ కొరియా.. ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. ఇక ఆతిథ్య ఇండొనేసియా గత టోర్నీలో 4 స్వర్ణాలతో 17వ స్థానంలో నిలిచింది. ఈసారి రెండంకెల సంఖ్యలో స్వర్ణాలు గెలవాలని, టాప్-10 లక్ష్యంగా పెట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications