
చెన్నై: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో పోటీ చేసే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. వచ్చే నెలలో ఆరంభం కానున్న ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు మూడు కోట్ల నగదు ఇవ్వనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం వెల్లడించారు. సిల్వర్ పతక విజేతకు రెండు కోట్లు, అలానే కాంస్య పతక విజేతకు ఒక కోటి ఇవ్వనున్నట్లు తమిళనాడు సీఎం తెలిపారు. సీఎం స్టాలిన్ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్లేయర్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదాపడి.. ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ షట్లర్ పీవీ సింధు జాతీయ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించే అవకాశం ఉంది. ఒలింపిక్స్ క్రీడల కోసం ఎంపిక చేసే ఇద్దరు పతాకధారుల్లో సింధు ఒకరని సమాచారం. లింగ సమానత్వం కోసం ఈసారి పురుషులు, మహిళల్లో ఒక్కొక్కరిని పతాకధారులుగా ఎంచుకోనున్నారు. 'ఇద్దరు పతాకధారుల్లో సింధు ఒకరు' అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. సింధుతో పాటు సాయిప్రణీత్, అథ్లెట్ నీరజ్ చోప్రా, టీటీ ఆటగాడు ఆచంట శరత్ కమల్, రెజ్లర్ బజరంగ్ పూనియా, బాక్సర్ అమిత్ పంఘాల్‌లపై భారత్ ఆశలు పెట్టుకుంది. అయితే స్టార్ స్ప్రింటర్ హిమా దాస్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం అనుమానంగానే ఉంది. ప్రస్తుతం పాటియాలాలో జరుగుతున్న నేషనల్ ఇంటర్-స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 100 మీటర్ల హీట్స్‌లో హిమా దాస్ కండరాలు పట్టేసాయి.
ఈసారి విశ్వ క్రీడలు చాలా భిన్నం. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయి. ఒలింపిక్స్ గ్రామంలోని అందరూ ప్రతి రోజూ కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రత చూసుకోవాలి, ముఖానికి ముసుగు ధరించాలి. గతంలో భోజన శాలలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉండేవాళ్లు, ఇష్టమైన ఆహారం తీసుకుంటూ సరదాగానే కనిపించేవాళ్లు. ఇప్పుడలా కాదు. ఎవరి స్థానాల్లో వాళ్లు కూర్చోవాలి. ఎవరినీ కలవకూడదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. భారత్ నుంచి 100కి పైగా అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.
ప్రతిరోజు 10000 మంది ప్రేక్షకులను మాత్రమే స్టేడియాలకు అనుమతిస్తామని టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎప్పటిలా పండుగ వాతావరణం ఉంటుందని ఊహించుకోవద్దని ఒలింపిక్స్ అధ్యక్షురాలు సీకో హషిమోటో అభిమానులకు స్పష్టం చేశారు. స్టేడియంలో మద్యపానం, కరచాలనాలు, కేరింతలు, ఆటోగ్రాఫ్‌లను నిషేధించారు. స్టేడియాలకు వచ్చే ప్రేక్షకుల ఉష్ణోగ్రత చూడటం తప్పనిసరి. మాస్కులు ధరించాలి. స్టేడియంలో మరో ప్రేక్షకుడిని కలవకూడదు. నిర్దేశించిన సీటులోనే కూర్చోవాలి.