భారత టేబుల్ టెన్నిస్ స్టార్, తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి భారత టీటీ ప్లేయర్‌గా రికార్డు నమోదు చేసింది. అంతేగాక, డబుల్స్ టైటిల్‌ను కూడా శ్రీజ నెగ్గింది. అర్చనా కామన్‌తో కలిసి డబుల్స్ పసిడి సాధించింది. దీం తో ఒకే టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గానూ ఘనత సాధించింది
మహిళల డబుల్స్‌లోనూ పసిడి నెగ్గిన ఈ హైదరాబాద్ అమ్మాయి.. ఒకే టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గానూ ఘనత సాధించింది. నైజీరియాలో జరిగిన టోర్నీలో మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి డింగ్ యిజీని శ్రీజ చిత్తుగా ఓడించింది. 4-1తో విజయం సాధించింది. 10-12తో తొలి సెట్‌లో ఓడిన శ్రీజ తర్వాత చెలరేగింది. 11-9, 11-6, 11-8, 11-6తో వరుసగా విజయ ఢంకా మోగించింది.

ఇక డబుల్స్ తుదిపోరులో అర్చనాతో కలిసి శ్రీజ గెలుపుతీరాలకు చేరింది. సహచర దియా- యశస్వి జోడిపై 3-0తో గెలిచింది. వరుస సెట్లలో 11-9, 11-6, 12-10తో ప్రత్యర్థిపై అర్చనా-శ్రీజ సత్తాచాటింది. మరోవైపు భారత పురుషుల జోడీ కూడా టైటిల్ నెగ్గింది. హర్మీత్ దేశాయ్ - మానవ్ టక్కర్ జోడీ కంటెండర్ టోర్నీలో విజేతగా నిలిచింది. నైజీరియా జంట అజీజ్-ఓమోటాయోను 3-0తో చిత్తు చేసింది. 11-8, 11-9, 11-8తో గెలిచి రికార్డు సృష్టించింది. కంటెండర్ టైటిల్ నెగ్గిన తొలి భారత పురుషుల జోడీగా హర్మీత్ దేశాయ్-మానవ్ టక్కర్ రికార్డులకెక్కారు.