
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. క్రీడల్లో నైపుణ్యం పెరగాలంటే విద్యార్థి స్థాయి నుంచే బీజంపడాలనే యోచనతో.. ఇండోర్ స్టేడియంను అందుబాటులోకి తెచ్చింది. హకీంపేట్‌లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు ఇండోర్ స్టేడియం పిల్లల భవిష్యత్‌కు వేదికగా నిలవనుంది. ఈ స్టేడియాన్ని తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ సోమవారం స్టేడియాన్ని ప్రారంభించారు.
కోటి 30 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియం అత్యాధునిక హంగులతో తయారైంది. సోమవారం మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలం హకీంపేట క్రీడా పాఠశాలలో రూ.1.80 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియం, రూ.3.70 కోట్లతో నిర్మించిన ప్రహరీగోడ నిర్మాణాన్ని ఆయన ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం జాతీయ స్థాయిలో సత్తా చాటుతోన్న స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. భవిష్యత్‌లోనూ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేలా క్రీడల్లో రాణించాలంటూ తన ఆకాంక్షను తెలియజేశారు.
ఈ సందర్భంగా రూ. 15 లక్షల విలువ చేసే ట్రాక్ సూట్లను క్రీడాకారులకు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మూడో తరగతి వరకు చదివించి క్రీడా పాఠశాలకు అప్పగిస్తే సొంత బిడ్డల్లా చదివించి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తే చర్యలు తీసుకొని ఏడాది లోపు నిర్మాణాన్ని పూర్తిచేస్తామని హామీఇచ్చారు. బాక్సింగ్, రెజ్లింగ్ ఆటల్లో కూడా శిక్షణ ఇచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. క్రీడా పాఠశాలలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.
ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ.. హకీంపేట క్రీడా పాఠశాలలలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తన కోటా నుంచి కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు బీవీ పాపారావు, బి.వెంకటేశం, ఎ.దినకర్‌బాబు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి, శాప్ ఛైర్మన్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ బి.చంద్రశేఖర్‌యాదవ్, జెడ్పీటీసీ పి.బాలేశ్, కె.నర్సయ్య, క్రీడల అధికారి ఆర్.కె.బోస్ పాల్గొన్నారు.