
హైదరాబాద్: 2018లో జరగనున్న కామన్ వెల్త్ క్రీడలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న సుశీల్ కుమార్ మరోసారి గోల్డ్ కోస్ట్ క్రీడల్లో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంకు వచ్చాడు.
ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజి భూషణ్ సింగ్ శరణ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ప్రఖ్యాతరెజ్లర్లు అందరూ వచ్చారు.
కామన్వెల్త్ క్రీడల రెజ్లింగ్ సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా పెను వివాదం చెలరేగింది. రెజ్లర్లు సుశీల్ కుమార్, పర్వీన్ వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పోటీల వేదిక ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం రణరంగంగా మారింది. సుశీల్ శుక్రవారం తాను ఆడిన అన్ని బౌట్లూ గెలిచాడు. ఐతే సెమీఫైనల్లో రాణాపై విజయం అనంతరం గొడవ మొదలైంది. సుశీల్‌తో పోటీపడేందుకు సాహసించినందుకు తనను, తన అన్నను అతడి మద్దతుదారులు కొట్టారని రాణా ఆరోపించాడు.
ఇక ఫ్రీస్టైల్‌లో సుశీల్ (74 కేజీ) వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించాడు. అతడితో పాటు రాహుల్ అవరె (57కేజీ), భజ్‌రంగ్ (65కేజీ), సోమ్‌వీర్ (86కేజీ), మౌసమ్ ఖత్రి (97కేజీ), సుమీత్ (125కేజీ) ఆ గేమ్స్‌కు అర్హులయ్యారు. గ్రీకో రోమన్ నుంచి పది మంది అర్హత సాధించారు.
డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్ శరణ్ మాట్లాడుతూ ఆ గొడవ మా పరిధిలో జరగలేదు. ఆటగాళ్లు వార్మప్ చేసుకునే ప్రాంతంలో సంభవించింది. పోలీసుల ద్వారా కేసు నమోదు చేయించాం. దర్యాప్తు జరగనుంది. అని పేర్కొన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.