
న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఎట్టకేలకు ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. ఏడాది కాలంగా మ్యాట్‌కు దూరంగా ఉన్న సుశీల్ కుమార్.. బెలారస్ టోర్నీ బరిలో దిగి పేలవ ఆటతో నిరాశపరిచాడు. అయితే తాజాగా నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌లో మాత్రం సుశీల్ అదరగొట్టాడు.
మంగళవారం జరిగిన 74 కిలోల ట్రయల్స్‌లో సుశీల్ కుమార్ 4-2తో జితేందర్ కుమార్‌ను ఓడించాడు. తొలి రౌండ్ ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన సుశీల్.. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. అయితే జితేందర్ వరుసగా రెండు పాయింట్లు సాధించి రేసులోకి వచ్చినా.. పుంజుకున్న సుశీల్ మ్యాచ్ గెలిచాడు. కజకిస్థాన్‌లోని నూర్-సుల్తాన్ వేదికగా సెప్టెంబర్ 14న వరల్డ్ చాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది.
ఓడినా జితేందర్‌కు వరల్డ్ చాంపియన్‌షిప్ ఆశలు ఉన్నాయి. 79 కిలోల విభాగంలో అతను మరోసారి ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక 74 కిలోల ట్రయల్స్‌లో అమిత్ ధన్‌కర్ ఓడిపోయాడు. రాహుల్ ఆవ్రే (61 కిలోలు), కరణ్ (70 కి), ప్రవీణ్ (92 కి), వీర్‌దేవ్ గులియా (79 కి)లు నాన్ ఒలింపిక్ డివిజన్ ట్రయల్స్‌లో విజయం సాధించారు.
భారత ఫ్రీస్టైల్ బృందం ఇదే:
రవి దహియా (57 కి), రాహుల్ ఆవ్రె (61 కి), బజ్‌రంగ్ పూనియా (65 కి), కరణ్ (70 కి), సుశీల్ కుమార్ (74 కి), దీపక్ పూనియా (86 కి), ప్రవీణ్ (92 కి), మౌసమ్ ఖత్రీ (97 కి), సుమీత్ మాలిక్ (125 కి), 79 కిలోల్లో జితేందర్-వీర్‌దేవ్.