
హైదరాబాద్: భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో అత్యధిక ధర పలికాడు. 2018 సీజన్ కోసం నిర్వహించిన ప్రొ రెజ్లింగ్ లీగ్ వేలంలో ఢిల్లీ సుల్తాన్స్ జట్టు అతడిని రూ.55 లక్షలకు దక్కించుకుంది. ఇప్పటి వరకు ప్రొ రెజ్లింగ్‌లో రెండు సీజన్లు జరగ్గా.. ఏ రెజ్లర్‌కూ ఇంత ధర పలకపోవడం విశేషం.
శనివారం న్యూఢిల్లీలో జరిగిన వేలంలో ఈ డబుల్ ఒలింపియన్‌ను దక్కించుకునేందుకు ఆరు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు పెద్ద మొత్తంలో వెచ్చించి ఢిల్లీ సుల్తాన్స్ సుశీల్‌ను దక్కించుకుంది. గత సీజన్లో రూ.46 లక్షల ధర పలికిన హసన్ రహిమి (హరియానా హ్యామర్స్)దే రికార్డు. ఆ ధరను ఇప్పుడు సుశీల్ అధిగమించాడు.
మూడో సీజన్ జనవరి 9 నుంచి ప్రారంభం కానుంది. ప్రొ రెజ్లింగ్‌లో ఇప్పటిదాకా సుశీల్ కుమార్ ఒక్క బౌట్ కూడా ఆడలేదు. మూడేళ్ల కిందట లీగ్ ఆరంభం కాగా తొలి సీజన్‌లో వ్యక్తిగత కారణాల వల్ల ఆడకుండానే లీగ్ నుంచి తప్పుకున్నాడు. తర్వాతి సీజన్‌కు అతను అందుబాటులోనే లేడు. ఇటీవలే రెజ్లింగ్‌లోకి పునరాగమనం చేశాడు.
జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌తో పాటు కామన్వెల్త్ రెజ్లింగ్ టోర్నీలోనూ స్వర్ణాలు గెలిచాడు. ఇదిలా ఉంటే మహిళల్లో అమెరికా రెజ్లర్, ఒలింపిక్ ఛాంపియన్ హెలెన్ మరోలిస్ రూ.44 లక్షలతో హరియాణా జట్టు ఆమెను సొంతం చేసుకుంది. 'సుశీల్ మా జట్టులో ఉండటం గౌరవంగా భావిస్తున్నాం. మేము ఉత్తమ రెజ్లర్లను ఎంచుకుని జట్టును అత్యుత్తమంగా తీర్చి దిద్దుతున్నాం' అని ఢిల్లీ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో పేర్కొంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.