
బెంగళూరు: భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఎట్టకేలకి స్వదేశంలో అడుగుపెట్టబోతున్నారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షల కారణంగా మూడు నెలల పాటు జర్మనీలో చిక్కుకున్న మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ శనివారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకోనున్నారు. 'ఆనంద్ ఈ రోజు తిరిగి వస్తున్నారు' అని చెస్ మాస్ట్రో భార్య అరుణ శనివారం ఉదయం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో పాల్గొనేందుకు గత ఫిబ్రవరిలో ఐరోపా వెళ్లిన ఆనంద్.. వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో జర్ననీలోని బాడ్‌సోడెన్ టౌన్‌లో చిక్కుకుపోయారు. తాజాగా లాక్‌డౌన్ నిబంధనల్ని సడలించడంతో ఆయన శుక్రవారం రాత్రి ఎయిర్ ఇండియా విమానంలో (ఎఐ-120) భారత్‌కి పయనమయ్యారు. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీ మీదుగా సుమారు మధ్యాహ్నం 1.15 గంటలకు బెంగళూరు చేరుకోనున్నారు. బెంగళూరు వచ్చిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజులు క్వారంటైన్ ఉండి ఆ తర్వాత ఆనంద్ చెన్నై వెళ్లాల్సి ఉంటుంది.
వాస్తవానికి మార్చి నెలలోనే భారత్‌కి వచ్చే అవకాశం విశ్వనాథన్ ఆనంద్‌కి వచ్చింది. కానీ తన స్వస్థలం చెన్నైకి చేరుకునే సూచనలు అప్పట్లో కనిపించకపోవడంతో అతను అక్కడే ఆగిపోయారు. దేశంలోనే అత్యధిక కరోనా వైరస్ కేసులు నమోదైన రెండో రాష్ట్రంగా తమిళనాడు 20,246 కేసులతో ప్రస్తుతం కొనసాగుతోంది. జర్మనీలోనే ఉంటూ ఆనంద్ ఆన్‌లైన్ చెస్ టోర్నీ ద్వారా పీఎం కేర్స్ ఫండ్‌కి విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ద్రోణవల్లి హారిక, కోనేరు హంపీ, హరికృష్ణ తదితరులతో కలిసి అతను టోర్నీని నిర్వహించారు.
విశ్వనాథన్ ఆనంద్ మూడు దశాబ్దాలుగా భారత చదరంగం చరిత్రలో తనదైన ముద్ర వేశారు. ఆనంద్ 1988లో భారత్ నుంచి తొలి గ్రాండ్ మాస్టర్‌గా ఎంపికయ్యారు. 2000 నుంచి 2013 వరకు ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆయన 2013లో మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక 2017లో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ గెలుపొంది మరోసారి తన సత్తా చాటారు.
చిన్నప్పుడు ఎవరైనా ఏమవుతావని అడిగితే వెంటనే 'ప్రపంచ ఛాంపియన్' అని బదులిచ్చేవాడినని భారత చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ గతంలో తెలిపారు. 'నేను చాలా అమాయకత్వంతో ఉన్న రోజులవి. అప్పుడు ఎవరైనా నా వద్దకు వచ్చి పెద్దయ్యాక చదరంగంలో ఏమౌతావ్ అని అడిగితే వెంటనే మరేమీ ఆలోచించకుండా ప్రపంచ ఛాంపియన్ అని బదులిచ్చేవాడిని' అని ఆనంద్ చెప్పారు.