న్యూఢిల్లీ: హర్యానా స్ప్రింటర్ ధర్మబీర్‌సింగ్‌పై నాడా వేటు వేసింది. రియో ఒలింపిక్స్‌కు ముందు డోప్ పరీక్షల్లో స్ప్రింటర్ ధరమ్‌వీర్ సింగ్ దొరకడంతో అతడిని జట్టు నుంచి తప్పించిన జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) ఎనిమిదేళ్ల పాటు నిషేధం విధించింది.
నాడా నిర్ణయంతో అతడి అథ్లెట్ కెరీర్ ఇక ముగిసినట్టేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. జులై 11న బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రి మీట్‌లో 200 మీటర్ల విభాగంలో పాల్గొన్న ధర్మభీర్ నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినట్లు నాడా పేర్కొంది.
గ్రాండ్‌ప్రి మీట్‌లో భాగంగా నిర్వహించిన డోపింగ్ పరీక్షలో ధరమ్‌వీర్ నుంచి నాడా శాంపిల్ తీసుకుంది. ఆ శాంపిల్‌లో నిషేధిత ఎనబోలిక్ స్టెరారుుడ్ వాడినట్టు తేలడంతో చివరి నిమిషంలో రియో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. 200మీటర్ల పరుగు పందెంలో ధర్మబీర్‌సింగ్‌కు ఇది రెండో డోపింగ్ అతిక్రమణ.

దీంతో అతడిపై 'నాడా' కఠినంగా వ్యవహరించింది. ఇదే విషయాన్ని నాడా అధికారికంగా ప్రకటించింది. ''ధర్మబీర్‌పై ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తున్నాం. అతను డోపింగ్‌కు పాల్పడడం ఇది రెండోసారి'' అని నాడా పేర్కొంది. ఇండియన్ గ్రాండ్ ప్రి మీట్‌లో ధర్మబీర్‌సింగ్ 20.45 సె. టైమింగ్‌తో జాతీయ రికార్డు నెలకొల్పుతూ రియోకు అర్హత సాధించాడు.
మరోవైపు 2012లో జరిగిన జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్స్‌లోనూ ధర్మబీర్ 100మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం నెగ్గాడు. అయితే ఆ తర్వాత డోపింగ్ టెస్టుకు దూరంగా ఉండడంతో అతడి నుంచి పసిడి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు.