
పరీక్షల కోసం రక్తాన్ని, కేశాలను ఇవ్వాలని కోచ్ విజేందర్ సింగ్‌కు సూచించాడు. దర్యాప్తు సంస్థకు పరీక్షల నిమిత్తం విజేందర్ సింగ్ తనంత తాను ముందుకు వచ్చి రక్తాన్ని, కేశాలను ఇవ్వాలని భారత బాక్సింగ్ కోచ్ జిఎస్ సంధూ సలహా ఇచ్చారు. పరీక్షల నిమిత్తం రక్తం, కేశాల నమూనాలను ఇవ్వడానికి విజేందర్ సింగ్ గత నెలలో తిరస్కరించాడు.
విజేందర్ సింగ్ సహచరుడు, బాక్సర్ రాంసింగ్ రక్తాన్ని, వెంట్రుకలను పరీక్షల నిమిత్తం పంజాబ్ పోలీసులు సేకరించారు. విజేందర్ సింగ్ 12 సార్లు మాదక ద్రవ్యాలు తీసుకున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. కెనడాకు చెందిన డ్రగ్స్ డీలర్ అనూప్ సింగ్ కహ్లోన్ అలియాస్ రూబీ వద్ద ఉత్ప్రేరకాలు కొన్నట్లు చెప్పారు. డ్రగ్స్ పరీక్షకు విజేందర్ నిరాకరించడంతో పట్టుదలగా ఉన్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
అందులో భాగంగా విజేందర్ ఫోన్ కాల్స్ లిస్ట్‌ను పోలీసులు ఆదివారం బయట పెట్టారు. నార్కోటిక్ డీలర్, స్మగ్లర్ రూబీతో విజేందర్.. 80 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు కాల్ రికార్డుల్లో తేలిందని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. అంతేగాక రాంసింగ్, విజేందర్‌లకు చాన్నాళ్ల నుంచీ రూబీతో పరిచయం ఉందని తేల్చిచెప్పారు. విజేందర్, రూబీ మధ్య ఎస్సెమ్మెస్‌ల రాయబారం కూడా నడిచిందని అన్నారు.