
సర్వీసు నిబంధనల ప్రకారం ఓ ఉద్యోగి 48 గంటలకు మించి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే అతను సస్పెన్షన్‌కు గురవుతాడని ఆయన చెప్పారు. శుక్రవారం పింకీ ప్రామాణిక్‌కు జిల్లా కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. క్రీడాకారుల కోటా కింద పింకీకి తూర్పు రైల్వేలో ఉద్యోగం వచ్చింది. లింగం విషయంలో నేరం చేసినట్లు రుజువైతే పింకీ ఉద్యోగం ఊడుతుంది. పింకీ సాధించిన పతకాలు కూడా వెనక్కి తీసుకుంటారు.
పింకీ ప్రామాణిక్ పురుషుడని, ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో పింకీ ప్రామాణిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తనపై పింకీ ప్రామాణిక్ అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని పింకీ ప్రామాణిక్ వాగ్దానం చేసి, ఆ తర్వాత నిరాకరించిట్లు ఆ మహిళ తెలిపింది. ఆ మహిళ నార్త్ 24 పరగణా జిల్లాలోని బాగుహతీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ప్రామాణిక్ ఖాతర్‌లోని దోహాలో జరిగిన 2006 ఆసియా క్రీడల్లో 4X400 మీటర్లలో రిలేలో స్వర్ణపతకాన్ని సాధించింది. అదే ఏడాది జరిగిన మెల్‌బోర్న్ కామన్‌వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించింది. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో పింకీ క్రీడల నుంచి తప్పుకుంది.