లండన్: ఒలింపిక్స్ నుంచి ఆర్చరీలో భారత జట్టు నిష్క్రమించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య లార్డ్స్ క్రికెట్ మైదానంలో శనివారం జరిగిన పోటీల్లో జపాన్ జట్టు చేతిలో భారత జట్టు ఓడిపోయింది. జయంత్ తాలూక్ దార్, రాహుల్ బెనర్జీ, తరుణ్ దీప్ రాయ్ శుక్రవారం జరిగిన రౌండ్ లో 12వ ర్యాంక్ సాధించారు. అయితే, జపాన్ తో జరిగిన పోటీలో శనివారం ఓడిపోయారు. జపాన్ కు చెందిన యూ ఇషిజూ, హిడెకీ కికుచి, తకహరు ఫురుకువా జట్టు భారత్ పై గెలిచింది.

రెగ్యులేషన్ ప్లేలో రెండు పాయింట్లు లీడ్ లో ఉన్న భారత క్రీడాకారులు టై బ్రేకర్ తో జపాన్ క్రీడాకారులు సమం చేశారు. దీంతో భారత ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత క్రీడాకారులు ముగ్గురు సోమవారం జరిగి వ్యక్తిగత ఎలిమినేషన్స్ రౌండ్స్ లో పాల్గొంటారు.
ఇదిలా వుంటే, ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మిక్స్ డ్ డబుల్స్‌లో కూడా భారత జోడీకి నిరాశే ఎదురైంది. జ్వాలా గుత్తా, దిజులతో కూడిన భారత జోడీ తొలి రౌండ్ లో ఓటమి పాలైంది. ఇండోనేషియా జోడీ తోంతోవి అహ్మద్, నట్సీర్ చేతిలో జ్వాలా జోడీ వరుస గేమ్స్ లో ఓటమి పాలైంది.
జ్వాలా, దిజు 16-21, 12-21 స్కోరుతో కేవలం 25 నిమిషాల వ్యవధిలో ఓటమి చవి చూసింది. గ్రూప్ సిలో మొత్తం ఆటలో ఒక్కసారి కూడా జ్వాలా జోడీ ప్రత్యర్థి జోడీకి పోటీ ఇవ్వలేకపోయింది. ఆదివారంనాడు ఇండియా జోడీ ఆదివారం డానిష్ జోడీ థామస్ సేబోర్న్, కమిల్లా రైట్టర్ జహ్లూ జోడీతో తలపడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ జట్లు రెండు క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంటాయి.