
లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన తర్వాత భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్‌కు సత్కాకారాలు, సన్మానాలు జరిగాయి. అయితే, బాక్సింగ్ అకాడమీకి స్థలం కేటాయింపుపై మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. 2010లో ప్రపంచ బాక్సింగ్ టైటిల్‌ను మేరీ కోమ్ ఐదో సారి సొంతం చేసుకుని మణిపూర్‌లో అడుగుబెట్టినప్పుడు బాక్సింగ్ అకాడమీ కోసం మూడెకరాల స్థలాన్ని మంజూరు చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకూ హామీని నెరవేర్చలేదు.
మహింద్ర గ్రూప్ ఆమెను గురువారం సన్మానించిన సందర్భంగా ఈ విషయాన్ని తెలిపింది. బాక్సింగ్ అకాడమీ స్థలం కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నానని, ఇప్పటి వరకూ ముందడుగు మాత్రం పడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనకు లభించిన గుర్తింపుపై ఆనందంగా ఉన్నాననీ, అయితే, తన వ్యక్తిత్వంలో మార్పు రాదని చెప్పింది.
మరో మూడు నెలల వరకూ పెద్ద టోర్నీలేవీ లేనందున ఆ తర్వాతే శిక్షణను మొదలుబెడతానని వివరించింది. 2014 గ్లాస్గో కామనె్వల్త్ క్రీడల్లో మహిళల బాక్సింగ్‌ను ప్రవేశపెట్టడంపై విలేఖరులు ప్రశ్నించగా, పాల్గొనడానికి ఎదురుచూస్తున్నానని చెప్పింది.