న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్‌లో వివిధ విభాగాల్లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించి ఆరు పతకాలను సాధించిన ఒలింపిక్ విజేతలు శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీని కలుసుకున్నారు. 7, రేస్ కోర్స్ రోడ్డులో ఉన్న ప్రధాని నివాసంలో మన్మోహన్‌ను రజిత పతక విజేతలు షూటర్ విజరుకుమార్, రెజ్లర్ సుశీల్‌కుమార్, కాంస్య పతకం గెలిచిన మహిళా బాక్సర్ మేరీకోమ్, షట్లర్ సైనా నెహ్వాల్, షూటర్ గగన్ నారంగ్, రెజ్లర్ యోగేశ్వర్ దత్ కలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారివెంట భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న వికె మల్హోత్రా, సెక్రటరీ జనరల్ రణధీర్‌సింగ్ కూడా ఉన్నారు.ప్రధాని భార్య గురుశరణ్ సింగ్ కూడా వారిని అభినందించారు. ప్రధాని, సోనియాను కలిసిన అనంతరం పతకాలు సాధించిన ఆటగాళ్లు బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీని కలుసుకున్నారు.
ఈ సందర్బంలో అద్వానీ మాట్లాడుతూ మీ అందరి ప్రదర్శన మమ్మల్ని గర్వపడేలా చేసింది. కానీ హాకీ జట్టు మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. కనీసం ఒక్క మ్యాచ్‌ను కూడా గెలుచుకోలేకపోయింది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో ధ్యాన్‌చంద్ జట్టు చరిత్రాత్మకంగా ఆడింది. మన జట్టు మీద ప్రత్యర్థి ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మేరీ కామ్ చూపించిన తెగువ నిజంగా అభినందనీయం అని అద్వానీ ప్రశంసించారు.
ఎన్నో ఏళ్లుగా పడిన కష్టానికి పతకం ద్వారా ప్రతిఫలం దక్కిందని ఒలింపిక్స్ విజేతలు అభిప్రాయపడ్డారు. రజత, కాంస్య పతకాలు సాధించిన ఆరుగురు ఆటగాళ్లకు సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్ ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. రజతం సాధించిన ఆటగాళ్లకు రూ.15 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.10 లక్షల నగదును అందజేశారు.
తెలుగు వన్ఇండియా