
ఒలింపిక్స్ పోటీలు మొదలై మూడ్రోజులైనా పతకాల పంట పండేది మాత్రం శనివారం నుంచే. అలాగే భారత్ అసలు సిసలు సమరం కూడా. శుక్రవారం కేవలం ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్లో పాల్గొన్న భారత్.. శనివారం పలు క్రీడాంశాల్లో పోటీపడుతోంది. స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్, శివథాపా, తెలుగుతేజాలు కశ్యప్, జ్వాల, సానియా, మహిళా వెయిట్‌లిఫ్టర్ సోనియా చాను, షూటర్ విజయ్‌కుమార్ తదితరులు బరిలోకి దిగుతున్నారు.
ఆరంభ వేడుకలకు ముందే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. సంబరాలూ అంబరాన్ని తాకాయి. శనివారం ఫలితం తేలే మూడు క్రీడాంశా ల్లో భారత్ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వీటిలో పురుషుల ఆర్చరీ టీమ్, పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్, మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగాలున్నాయి. అయితే, ఈ మూడింటిలోనూ భారత్‌కు పతకం వచ్చే అవకాశాలు తక్కువే.
ఆర్చరీలో అతికష్టమ్మీద ర్యాంకింగ్ రౌండ్ అధిగమించిన భారత పురుషుల జట్టు.. టాప్ జట్లపై గెలుపొందడం కష్టమే. ఇక షూటర్ విజయ్ కుమార్, మహిళా వెయిట్‌లిఫ్టర్ సోనియా చాను పోటీపడుతున్నారు. ఈ రెండు అంశాల్లోనూ అంచనాలు అంతంత మాత్రమే. ఇక టేబుల్ టెన్నిస్ సిం గిల్స్ ప్రిలిమినరీ రౌండ్లో అంకితా దాస్, సౌమ్యజిత్ ఘోష్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
శనివారంనాటి పోటీల్లో ముగ్గురు రాష్ట్ర క్రీడాకారులు పాల్గొంటున్నారు. బ్యాడ్మింటన్ పు రుషుల సింగిల్స్‌లో కశ్యప్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో జ్వాల, టెన్నిస్ మహిళల డబుల్స్‌లో సానియా సమరానికి సన్నద్ధమయ్యారు. రష్మీ చక్రవర్తితో కలసి బరిలోకి దిగుతున్న సానియా తొలిరౌండ్లో చైనీస్‌తైపీ జోడీ చ్వాంగ్, సీహ్‌తో తలపడనుంది. ఇక కశ్యప్ గ్రూప్ దశలో టాన్ యుహాన్ (బెల్జియం)తో, మహిళల డబుల్స్‌లో అశ్వినీతో కలసి జ్వాల.. ఫుజి/కకీవా (జపాన్)తో, మిక్స్‌డ్‌లో దిజుతో జతకట్టి నట్సిర్/అహ్మద్ (ఇండోనేసియా)తో పోటీపడుతున్నారు.
పలు ఆశలతో లండన్ చేరిన భారత బాక్సర్లకు ఒలింపిక్స్‌లో క్లిష్టమైన డ్రా ఎదురైంది. భారత ఏస్ బాక్సర్, బీజింగ్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత విజేందర్ సింగ్ (75 కేజీలు)కు తొలిరౌండ్లో డనెబెక్ సుజ్‌నోవ్ (కజకిస్తాన్) రూపంలో కఠినమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. శనివారం నుంచి ఎక్సెల్ ఎరీనాలో బాక్సింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. భారత టీనేజ్ సంచలనం శివ థాపా (56 కేజీలు) మెక్సికోకు చెందిన ఆస్కార్ వల్దెజ్ ఫియరోతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. 69 కేజీల విభాగంలో మూడో సీడ్‌గా బరిలోకి దిగుతున్న వికాస్ కిషన్‌కు మాత్రం తొలిరౌండ్లో బై లభించింది.
ఐదు సార్లు ప్రపంచ చాంపియన్, భారత ఏస్ బాక్సర్ మేరీ కోమ్ తొలి మ్యాచ్‌లో కరోలినా మిఖాల్జక్ (పోలెండ్)తో తలపడనుంది. ఒలింపిక్స్‌లో తొలిసారిగా బరిలోకి దిగుతున్న మేరీ.. ఆగస్టు 5న జరిగే 51 కేజీల విభాగం లో కరోలినాను ఎదుర్కోబోతుంది. కచ్చితంగా పతకం తెస్తుందన్న నమ్మకమున్న మేరీ.. రెండు మ్యాచ్‌ల్లో నెగ్గితే భారత్ ఖాతాలో ఓ మెడల్ చేరినట్టే.