
వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబపరంగా లండన్ ఒలింపిక్స్ కొందరికి ప్రత్యేకంగా నిలువనున్నాయి. ఒక్కపతకం గెలిస్తేనే సంతోషపడే చోట రెండు, మూడు పతకాలతో కొన్ని కుటుంబాల్లో ఆనందం రెట్టింపు కావడానికి వేదిక సిద్ధమైంది. అక్కా చెల్లెల్లు, అన్నా చెల్లెలు, తండ్రి కూతుళ్లు, అన్నదమ్ములు, కవల సోదరులు ఇలా... ఈసారి లండన్ ఒలింపిక్స్ ఫ్యామిలీ క్రీడలు కానున్నాయి. 19 కుటుంబాల నుంచి పలువురు క్రీడాకారులు తమ విన్యాసాలతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. కొందరు తొలిసారి ఈ విశ్వక్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరికొందరు అపార అనుభవంతో పతకాల వేట కొనసాగించేందుకు తహతహలాడుతున్నారు.
కజుహితో, రియి, యుసుకె తనాకా-జిమ్నాస్టిక్స్, జపాన్
ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో జపాన్‌కు మంచి రికార్డు ఉంది. 2004 ఏథెన్స్‌లో స్వర్ణం, 2008 బీజింగ్‌లో రజతం సాధించింది. అదే జోరును లండన్‌లోనూ కొనసాగించాలనే లక్ష్యంతో జపాన్ సిద్ధమైంది. తొలిసారి జపాన్ బృందంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి చోటు లభించింది. ఈ ముగ్గురిలో పెద్దవాడైన 27 ఏళ్ల కజుహితో తనాకా పురుషుల జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. సోదరి 25 ఏళ్ల రియి తనాకా మహిళల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. తమ్ముడు 22 ఏళ్ల యుసుకె జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ ముగ్గురు ఆల్‌రౌండ్ ఈవెంట్‌లో పోటీపడతారు. 1984 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్ తర్వాత జపాన్‌కు వ్యక్తిగత అంశంలో స్వర్ణం లభించలేదు. అయితే ఆ లోటును లండన్‌లో తీరుస్తామని తనాకా ఫ్యామిలీ విశ్వాసంతో ఉంది.
స్టీవెన్ లోపెజ్, డయానా లోపెజ్-తైక్వాండో, అమెరికా
ప్రపంచ తైక్వాండో సర్క్యూట్‌లో లోపెజ్ ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది. వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 33 ఏళ్ల స్టీవెన్ లోపెజ్ సిడ్నీ, ఏథెన్స్‌లో స్వర్ణాలు సాధించాడు. బీజింగ్‌లో కాంస్యం దక్కించుకున్నాడు. స్టీవెన్ సోదరి డయానా రెండోసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతోంది. నాలుగేళ్ల క్రితం బీజింగ్‌లో డయానా కాంస్యం సాధించింది. లండన్‌లో ఈ ఇద్దరూ పసిడి పతకాలు సంపాదించాలనే లక్ష్యంతో సాధన చేశారు. స్టీవెన్ పెద్దన్నయ్య జీన్ ప్రస్తుత అమెరికా తైక్వాండో జట్టుకు కోచ్‌గా... స్టీవెన్ తమ్ముడు మార్క్ ప్రాక్టీస్ పార్ట్‌నర్‌గా లండన్ ఒలింపిక్స్‌లో అడుగు పెడుతున్నారు.
పావోల్, పీటర్ హోచొర్నర్-కనోయింగ్, స్లొవేకియా
వరుసగా మూడు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించి కనోయింగ్‌లో ఆల్‌టైమ్ జోడిగా స్లొవేకియాకు చెందిన కవల సోదరులు పావోల్, పీటర్ హోచొర్నర్ గుర్తింపు పొందారు. 32 ఏళ్ల ఈ అవూర్వ సహోదరులు లండన్‌లోనూ పసిడి పతకాన్ని నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌లుగా, ఎనిమిదిసార్లు యూరోపియన్ చాంపియన్‌లుగా నిలిచిన పావోల్-పీటర్ జోరుకు ఎవరు బ్రేక్ వేస్తారో వేచి చూడాలి.
హేలీ చాప్‌మన్, డేవిడ్ చాప్‌మన్-షూటింగ్, ఆస్ట్రేలియా
ఏకాగ్రతకు మారుపేరైన షూటింగ్‌లో ఆస్ట్రేలియా నుంచి తండ్రి, కూతురు డేవిడ్ చాప్‌మన్, హేలీ చాప్‌మన్ పోటీ పడనున్నారు. 47 ఏళ్ల డేవిడ్‌ను స్ఫూర్తిగా తీసుకొని షూటింగ్‌లో అడుగుపెట్టిన 20 ఏళ్ల హేలీ తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. హేలీ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన తండ్రి డేవిడ్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ ఈవెంట్‌లో పోటీపడతారు. ఆస్ట్రేలియా క్రీడాచరిత్రలో తండ్రి, కూతురు కలిసి ఒకే ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి కానుంది.
తిరునిష్, జెన్‌జెబె-అథ్లెటిక్స్, ఇథియోపియా
బీజింగ్ ఒలింపిక్స్‌లో 5000, 10000 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తిరునిష్ దిబాబా ఈ ఒలింపిక్స్‌లో మాత్రం 10 వేల మీటర్ల అంశంలో మాత్రమే బరిలోకి దిగుతోంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఇప్పటిదాకా నాలుగు స్వర్ణాలు నెగ్గిన 27 ఏళ్ల తిరునిష్ మూడో ఒలింపిక్ స్వర్ణంపై గురి పెట్టింది. తిరునిష్ సోదరి, 21 ఏళ్ల జెన్‌జెబె దిబాబా తొలిసారి ఒలింపిక్స్‌లో అడుగుపెట్టనుంది. 1500 మీటర్ల రేసులో పాల్గొననున్న జెన్‌జెబె ఇటీవల ప్రపంచ ఇండోర్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఈ ఇద్దరూ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే పసిడి సాధించడం ఖాయం.
ఇలా మరిన్ని కుటుంబాలకు చెందినవారు కూడా ఈ ఒలింపిక్స్ క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అమెరికా, తదితర దేశాలకు చెందిన క్రీడాకారులు ఒకే కుటుంబం నుంచి వస్తున్నవారు ఉన్నారు.