న్యూఢిల్లీ, జులై 6: భారత్ పుట్‌బాల్‌లో ఓ సరిక్రొత్త అధ్యయనం మొదలైంది. ప్రపంచానికి క్రిస్టియానో రొనాల్డో, లూయిస్ ఫిగో లాంటి అత్యంత అద్బుతమైన ఆటగాళ్లను అందించిన 'స్పోర్టింగ్ లిస్బన్' భారత పుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెత్రితో ఒప్పందం కుదుర్చుకుంది. 'స్పోర్టింగ్ లిస్బన్' జట్టులో కెప్టెన్ సునీల్ చెత్రి ఏడాది పాటు ఆడనున్నాడు. ఒప్పందంలో భాగంగా సునీల్ చెత్రి మొదటగా పోర్చుగల్‌కు చెందిన బి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇందులో ప్రదర్శన ఆధారంగా చెత్రిని ప్రధాన జట్టుకు ఆడే అవకాశాన్ని పరిశీలిస్తారు.

పోర్చుగల్‌కు చెందిన 'స్పోర్టింగ్ లిస్బన్' క్లబ్ తరఫున బరిలోకి దిగనున్న సందర్బంలో సునీల్ చెత్రి మాట్లాడుతూ 163వ ర్యాంకులో ఉన్న నేను ప్రపంచంలో ఉన్న మేటి గాళ్లతో కలిసి ఆడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రెండు వారాల్లో సునీల్ చెత్రి పోర్చుగల్‌కు వెళ్లనున్నాడు. పోర్చుగల్ క్లబ్ తరుపున సునీల్ చెత్రి ఆడబోతుండడం భారత పుట్ బాల్‌కు శుభపరిణామం అని భారత్ పుట్ బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రపుల్ పటేల్ అన్నారు.
ప్రస్తుతం భారత్ ఫుట్‌బాల్ జట్టు సభ్యుల వివరాలు చర్చకు వస్తే ఇద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఒకరేమో కెప్టెన్ బైచుంగ్ భూటియా... మరొకరు సునీల్ చెత్రి. 34 ఏళ్ల భూటియా వందకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో ఆడాడు. ఇంగ్లండ్ లోని గ్రేటర్ మాంచెస్టర్ కు చెందిన బ్యూరీ ఫుట్‌బాల్ క్లబ్‌కు (1999-2002) ప్రాతినిధ్యం వహించాడు. తద్వారా ఈ ఘనత వహించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. సునీల్ చెత్రి అమెరికాలోని కన్సాస్ సిటీ విజార్డ్స్ జట్టుకు ఆడుతున్నాడు.
గతంలో జరిగిన ఎనిమిది దేశాల దక్షిణాసియా ఫుట్‌బాల్ (శాఫ్) చాంపియన్‌షిప్‌లో భారత్ ఆరోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో సునీల్ చెత్రి కీలక పాత్ర పోషించాడు. 71వ నిమిషంలో సునీల్ చెత్రి పెనాల్టీ కార్నర్ ద్వారా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి భారత్‌కు తొలి గోల్ అందించాడు. దీంతో సునీల్ చెత్రి 'శాఫ్' ఒకే టోర్నీలో అత్యధికంగా ఏడు గోల్స్ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు విజయన్ (1997లో ఆరు గోల్స్) పేరిట ఉండేది. గతంలో టీమిండియా 1993, 1997, 1999, 2005, 2009లలో 'శాఫ్' టైటిల్‌ను గెల్చుకుంది. 2011వ సంవత్సరానికి గాను స్టార్ స్ట్రైకర్ సునీల్ చెత్రి ఏఐఎఫ్‌ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను దక్కించుకున్నాడు.
తెలుగు వన్ఇండియా