
స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ 12 సార్లు హెరాయిన్ తీసుకున్నట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. విజేందర్ స్నేహితుడు రాంసింగ్ ఐదు సార్లు డ్రగ్స్ సేవించాడని వారు తెలిపారు. కెనడాకు చెందిన డ్రగ్స్ డీలర్ అనూప్ సింగ్ కహ్లోన్ అలియాస్ రూబీ వద్ద ఉత్ప్రేరకాలు కొన్నట్లు చెప్పారు. డ్రగ్స్ పరీక్షకు విజేందర్ నిరాకరించడంతో పట్టుదలగా ఉన్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
అందులో భాగంగా విజేందర్ ఫోన్ కాల్స్ లిస్ట్‌ను పోలీసులు ఆదివారం బయట పెట్టారు. నార్కోటిక్ డీలర్, స్మగ్లర్ రూబీతో విజేందర్.. 80 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు కాల్ రికార్డుల్లో తేలిందని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. అంతేగాక రాంసింగ్, విజేందర్‌లకు చాన్నాళ్ల నుంచీ రూబీతో పరిచయం ఉందని తేల్చిచెప్పారు. విజేందర్, రూబీ మధ్య ఎస్సెమ్మెస్‌ల రాయబారం కూడా నడిచిందని అన్నారు.
వీటిని ఆధారంగా చూపి విజేందర్ రక్తం, వెంట్రుక పరీక్షలకు కోర్టు నుంచి అనుమతి పొందాలని భావిస్తున్నట్టు లూథియానా రేంజ్ డీఐజీ ఫరూఖీ స్పష్టం చేశారు. ఈ ఆధారాలను కోర్టుకు సమర్పించి, జడ్జీల సూచన ప్రకారం తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని ఫరూఖీ తెలిపారు. కాగా, గతనెలలో డ్రగ్స్ పరీక్ష కోసం పోలీసులు కోరిన నమూనాలను ఇవ్వడానికి విజేందర్ నిరాకరించిన విషయం తెలిసిందే.