
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, ఆధునిక వసతులతో ఇంగ్లండ్‌లో 34 వేదికలను పోటీలకు సిద్ధం చేశారు. కొన్నింటిని కొత్తగా నిర్మించగా, మరికొన్నింటిని ఆధునీకరించారు. ప్రధాన వేదిక ఒలింపిక్ స్టేడియాన్ని సరికొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దారు. ఆరంభ, ముగింపు వేడుకలకు ఈ వేదికే ఆతిథ్యమివ్వనుంది. ఇందులో 80 వేల మంది ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఉండగా.. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లకు పైగా టీవీల ద్వారా ఈ వేడుకలను వీక్షిస్తారని అంచనా. ఒలింపిక్స్ ఆరంభం కాకముందే ఈ స్టేడియం కోట్లాది క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది. ఒలింపిక్ స్టేడియం విశేషాల గురించి తెలుసుకుందాం..
- ఈ ప్రధాన స్టేడియం నిర్మాణానికి 4650 కోట్ల రూపాయల వ్యయమైంది.
- 2008 మేలో నిర్మాణం పనులు ప్రారంభించి 2011 మే నాటికి పూర్తి చేశారు.
- వేదిక స్థలం కోసం 30 బిల్డింగ్‌లను నేలమట్టం చేశారు.
- నిర్మాణంలో పదివేల టన్నుల స్టీల్‌ను వాడారు.
- సీటింగ్ కెపాసిటీ 80 వేలు. వీటిలో 55 వేల సీట్లను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
- ఇందులో మొత్తం 700 గదులు ఉన్నాయి.
- ఈ వేదిక ఒలింపిక్ పార్క్‌కు దక్షిణం వైపు ఉంటుంది.
- ఆరంభ (27న), ముగింపు వేడుకలకు ఒలింపిక్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
- ఈ వేదికలోనే అథ్లెటిక్స్ పోటీలు (ఆగస్టు 3 నుంచి 12 వరకు) నిర్వహించనున్నారు.
- లండన్‌లోని స్ట్రాట్‌ఫోర్డ్, వెస్ట్ హామ్ రైల్వే స్టేషన్ల (అండర్‌గ్రౌండ్) నుంచి ఈ వేదికకు చేరుకోవచ్చు.
- రోడ్డు మార్గాన ఐదు బ్రిడ్జిల గుండా ఇక్కడికి వెళ్లవచ్చు.
- పోటీల అనంతరం ఈ స్టేడియాన్ని సొంతం చేసుకునేలా వెస్ట్ హామ్ చాంపియన్‌షిప్ క్లబ్ మొదట ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం న్యాయపరమైన చిక్కులు రావడంతో ఒలింపిక్ పార్క్ లెగసీ కమిటీ ఒప్పందాన్ని రద్దుచేసింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత క్రీడా వేదికగా కొనసాగిస్తారు.