
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2020లో తన ప్రదర్శనపై భారత్ స్టార్ ఆర్చర్ అతాను దాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'సారీ ఇండియా.. ఈ ఒలింపిక్స్‌లో నీకు గొప్ప పేరు తీసుకురాలేకపోయా' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఆర్చరీ పురుషుల విభాగంలో మంచి ప్రదర్శన చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్తాడని భావించిన అతాను దాస్ శనివారం ఉదయం నిరాశపరిచాడు. ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో అతడు జపాన్ ఆర్చర్ తాకాహరు ఫురుకవా చేతిలో 4-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. తొలి సెట్‌లోని 8వ రింగ్‌లో తృటిలో లక్ష్యాన్ని చేరుకోకపోవడమే దాస్ ఓటమికి కారణమైంది.
తన ఓటమిపై ట్విట్టర్ వేదికగా అతాను దాస్ భారత దేశ ప్రజలకు క్షమాపణలు తెలియజేశాడు. 'సారీ ఇండియా.. ఈ ఒలింపిక్స్‌లో నీకు గొప్ప పేరు తీసుకురాలేకపోయా. నా వెన్నంటి నిలిచిన అధికారులకు కృతజ్ఞతలు. సాయ్, భారత ఆర్చరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని దాటుకొని ముందుకువెళ్లాల్సి ఉంది. లేకపోతే చెప్పడానికి ఏమీ ఉండదు. జై హింద్' అంటూ అతాను దాస్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై భారత అభిమానులు స్పందిస్తున్నారు. గొప్ప పోరాటం చేశావ్ అని ప్రశంసిస్తున్నారు.
ఒలింపిక్స్‌లో ప్రతి మ్యాచ్ వైవిధ్యంగా ఉంటుందని, అక్కడి పరిస్థితులు, క్రీడాకారుల ఆలోచనా ద్రక్పథం అన్నీ మరోలా ఉంటాయని మ్యాచ్ అనంతరం అతాను దాస్ పేర్కొన్నాడు. ఇక్కడ తాను ఓడిపోయినా శక్తిమేరకు పోరాడానని చెప్పాడు. ఎక్కువగా ఆందోళన చెందానని అన్నాడు. వచ్చేసారి ఇంకా బాగా ఆడతానని దాస్ ధీమా వ్యక్తం చేశాడు. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ దాస్ 4-6 తేడాతోనే కొరియన్ ఛాంపియన్ లీ సింగ్యన్ చేతిలో ఓటమిపాలయ్యాడు.
ఒలింపిక్స్ 2021లో మెడల్ ఆశలు రేపిన భారత ఆర్చర్, వరల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి కూడా ఇప్పటికే నిరాశపరిచిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత రికర్వ్ క్వార్టర్‌ఫైనల్లో దీపికా ఓటమిపాలైంది. కొరియా ఆర్చర్ ఆన్ సాన్‌తో జరిగిన క్వార్టర్స్‌లో 0-6తో దీపికా పరాజయం పాలైంది. మూడు సెట్లలోనూ దీపికపై ఆన్ సాన్ పైచేయి సాధించింది. ఎక్కడ కూడా అవకాశం ఇవ్వని కొరియా ఆర్చర్ అద్భుత ఆటతో సెమీస్ చేరింది.